భారత్‌ నుంచి అమెరికాకు పెరుగుతున్న వలసలు | Sakshi
Sakshi News home page

భారత్‌ నుంచి అమెరికాకు పెరుగుతున్న వలసలు

Published Thu, Sep 8 2016 7:30 PM

భారత్‌ నుంచి అమెరికాకు పెరుగుతున్న వలసలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రజల వలసలే ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా అధ్యక్షపదవికి రిపబ్లికన్ల తరఫున పోటీచేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారమంతా ఈ సమస్య చుట్టే తిరుగుతోంది. పొరుగున్న మెక్సికో నుంచి పెరుగుతున్న వలసలను నియంత్రిస్తానని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి మెక్సికో నుంచి వలసలు గతంతో పోలిస్తే బాగా తగ్గాయి. ఇప్పుడు అగ్రస్థానంలో భారత దేశమే ఉందని, మెక్సికో కనీసం రెండో స్థానంలో కూడా లేదని, చైనా తర్వాతనే మెక్సికో ఉందని 'వాల్‌స్ట్రీట్‌ జర్నల్' తాజా విశ్లేషణలు చెబుతున్నాయి.

2012 నుంచి 2014 వరకు అందుబాటులో ఉన్న వలసల గణాంకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ విశ్లేషణలు చేసింది. వలసల్లో అక్రమ వలసలు, చట్టబద్ధంగా వచ్చిన వలసలు ఉన్నాయి. ఇతర దేశాల సంతతికి చెందినవారిని కాకుండా ఇతర దేశాల్లో పుట్టి అమెరికాకు వచ్చి స్థిరపడిన వారినే వలసల గణాంకాల్లోకి తీసుకున్నారు. భారత్‌ నుంచి మెక్సికో కన్నా భారీగా వలసలు పెరిగాయంటే దానర్థం అమెరికాలో ప్రస్తుతం మెక్సికోలకన్నా భారతీయులు ఎక్కువగా ఉన్నారన్న అర్థం కాదు.

మెక్సికోలో పుట్టి అమెరికాలో స్థిరపడినవారి సంఖ్య 1.10 కోట్లు కాగా, భారత్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడినవారి సంఖ్య 22 లక్షలు. ఇతర దేశాల్లో పుట్టి అమెరికాలో వచ్చి స్థిరపడిన మొత్తం వలస ప్రజల్లో మెక్సికన్ల సంఖ్య 27.9 శాతం కాగా, భారతీయుల సంఖ్య 5.2 శాతం. 2012 నుంచి అమెరికాకు వలసవచ్చే మెక్సికన్ల, చైనీయుల సంఖ్య బాగా పడిపోయినా, భారతీయుల సంఖ్య మాత్రం పెరగుతూనే వస్తోంది.

మెక్సికోలో, చైనాలో ఉద్యోగావకాశాలు పెరగడమే అమెరికాకు ఆయా దేశాల నుంచి వలసలు తగ్గడానికి కారణమని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనర్లకు ఇప్పటికీ అమెరికాలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారతీయులు అమెరికాకు క్యూ కడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement