ఆ మూడు తరవాతే ఇండియా!

India At 4th Place In International Growth After PWC Survey - Sakshi

అమెరికా, చైనా, జర్మనీకే ఇన్వెస్టర్లు సై

వృద్ధిపై సీఈవోల్లో సన్నగిల్లిన విశ్వాసం

భారత సీఈవోల్లో పెరిగిన ఆశాభావం

పీడబ్ల్యూసీ సీఈవో సర్వే వెల్లడి

దావోస్‌: అంతర్జాతీయ వృద్ధి పట్ల సీఈవోల్లో విశ్వాసం కనిష్ట స్థాయికి చేరింది. అయినా కానీ, అంతర్జాతీయంగా అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్‌ వారికి నాలుగో ప్రాధాన్య దేశంగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ సంస్థ సీఈవోలపై నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది. భారత్‌లో తమ వ్యాపార వృద్ధికి అనుకూల పరిస్థితులున్నట్టు అంతర్జాతీయంగా నిర్వహించిన ఈ సర్వేలో 9 శాతం మంది సీఈవోలు చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సులో భాగంగా ఈ నివేదికను పీడబ్ల్యూసీ విడుదల చేసింది.

తమ ఆదాయ వృద్ధి అవకాశాల పట్ల భారత సీఈవోలు ఎంతో ఆశావహంగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది. చైనాలో 45 శాతం మంది సీఈవోలు ఈ రకమైన విశ్వాసంతో ముందుండగా, ఆ తర్వాత భారత సీఈవోల్లోనే అత్యధిక విశ్వాసం వ్యక్తమైంది. 40 శాతం భారత సీఈవోలు వృద్ధి అవకాశాల పట్ల నమ్మకంగా ఉన్నారు. ఆ తర్వాత అమెరికాలో 36 శాతం, కెనడాలో 27 శాతం, బ్రిటన్‌లో 26 శాతం, జర్మనీలో 20 శాతం సీఈవోల్లో ఇదే విశ్వాసం వ్యక్తమైంది.

అంతర్జాతీయంగా చూస్తే... తమ కంపెనీ అవకాశాల పట్ల సానుకూలత వ్యక్తం చేసిన వారు కొద్ది మందే. 27 శాతం సీఈవోలు మాత్రమే ఈ ఏడాది ఆదాయ వృద్ధి అవకాశాలపై నమ్మకంతో ఉన్నారు. 2009 తర్వాత అంతర్జాతీయంగా సీఈవోల్లో విశ్వాసం ఇంత కనిష్ట స్థాయికి చేరడం మళ్లీ ఇదే. గతేడాది ఇది 35 శాతంగా ఉంది.

నిరాశావాదం తారస్థాయిలో.. 
అంతర్జాతీయ వృద్ధి పట్ల సీఈవోల్లో నిరాశావాదం రికార్డు స్థాయికి చేరిందని పీడబ్ల్యూసీ సర్వే పేర్కొంది. అంతర్జాతీయ జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందని సగానికి పైగా సీఈవోలు చెప్పడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

వ్యాల్యుబుల్‌ 500 ఇనీషియేటివ్‌లో డాక్టర్‌ రెడ్డీస్, మహీంద్రా 
వైకల్యం ఉన్న వారికి ఉపాధి కల్పించే విషయంలో గూగుల్, యాక్సెంచర్, బోయింగ్, కోకకోలా తదితర కంపెనీలతోపాటు భారత్‌ నుంచి డాక్టర్‌ రెడ్డీస్, మహీంద్రా, సరోవర్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ముందుకొచ్చాయి. 24 దేశాల నుంచి మొత్తం 241 కంపెనీలు ‘వాల్యుబుల్‌ 500 ఇనీషియేటివ్‌’ కార్యక్రమంలో చేరాయని, ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెలు 9.9 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, వీటి ఆదాయం 3.8 ట్రిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని డబ్ల్యూఈఎఫ్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు ఎంతో కొంత వైకల్యాన్ని ఎదుర్కొంటున్నట్లు గుర్తు చేసింది.

పారదర్శక వాణిజ్యాన్నే భారత్‌ కోరుకుంటోంది: గోయల్‌ 
పారదర్శకమైన, సమతుల్యమైన వాణిజ్య భాగస్వామ్యాల కోసం భారత్‌ కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సదస్సులో స్పష్టం చేశారు. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల్లో వృద్ధికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సహకారం మరింత విస్తృతం కావాలని పిలుపునిచ్చారు.

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్‌సీఈపీ) ప్రస్తుత రూపంలో ఉన్నది భారత్‌కు ఆమోదనీయం కాదన్నారు. ఈ ప్రాంతంలో చైనా, ఇతర దేశాలతో భారత్‌ వాణిజ్య లోటును కలిగి ఉందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని చెప్పారాయన.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top