ఇమ్రాన్‌ పార్టీకి మరో 33 సీట్లు

Imran Khan's PTI gets 33 reserved seats in Pakistan National Assembly - Sakshi

రిజర్వుడ్‌ సీట్లను కేటాయించిన పాక్‌ ఈసీ

మెజారిటీకి మరో 14 సీట్లు అవసరం

ఇస్లామాబాద్‌: ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ టెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీకి ఎన్నికల సంఘం 33 రిజర్వుడ్‌ సీట్లను కేటాయించింది. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన సీట్ల ఆధారంగా పార్టీలకు రిజర్వుడ్‌ సీట్లను ఈసీ కేటాయించింది. పాకిస్తాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో మొత్తంగా 60 సీట్లు మహిళలకు, 10 సీట్లు మైనారిటీలకు రిజర్వు చేశారు. ఇందులో పీటీఐకి 28 మంది మహిళలు, ఐదుగురు ముస్లిమేతరుల సీట్లను ఈసీ కేటాయించింది. దీంతో పీటీఐ నేషనల్‌ అసెంబ్లీలో సీట్ల సంఖ్య 158కి చేరింది. ఇటీవలి ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. దీంతోపాటు 9 మంది ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడంతో ఇమ్రాన్‌ బలం 125 సీట్లకు చేరింది.

తాజాగా 33 రిజర్వుడ్‌ సీట్లు కేటాయించిన నేపథ్యంలో.. సాధారణ మెజారిటీకి 14 సీట్ల దూరంలో పీటీఐ నిలిచింది. సభ మొత్తం సభ్యుల సంఖ్య 342 కాగా.. సాధారణ మెజారిటీ సాధించాలంటే 172 సీట్లు ఉండాలి. ఈసీ కేటాయించిన రిజర్వుడ్‌ సీట్లలో కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీకి పంజాబ్‌ నుంచి 16 మంది మహిళలు, సింధ్‌ నుంచి నలుగురు, ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా నుంచి ఏడుగురు, బెలూచిస్తాన్‌ నుంచి ఒకరిని ఈసీ కేటాయించింది. ఇక మైనారిటీ కోటాలో ఐదు సీట్లు పీటీఐకి పోగా... పీఎంఎల్‌–ఎన్‌కు 2 సీట్లు, పీపీపీకి రెండు సీట్లు, ఎంఎంఏ పార్టీకి ఒక సీటును ఈసీ కేటాయించింది. పాక్‌ కొత్త పార్లమెంటు సోమవారం కొలువుదీరనుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top