ఎన్ ‌95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం

Georgia Man Charged For $317 Million Sale of Virus Masks That Didn't Exist - Sakshi

జార్జియా: కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తరుణంలో కొత్త రకాల మోసాలు బయటపడుతున్నాయి. ఓ వ్యక్తి ఫేస్‌ మాస్క్‌లు విక్రయిస్తానంటూ విదేశీ సంస్థతో $317 మిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకొని మోసం చేసిన ఘటన జార్జియాలో జరిగింది. కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో మాస్క్‌లకు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడింది. ఈ డిమాండ్‌ని ఆసరాగా చేసుకొని కొందరు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. సవన్నాలోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో న్యాయవాదులు దాఖలు చేసిన పత్రాల ప్రకారం.. జార్జియాకు చెందిన పౌల్‌ పెన్‌ మరో ఇద్దరు కలిసి 50 మిలియన్‌ ఎన్-95 మాస్క్‌లను ఓ విదేశీ ప్రభుత్వానికి విక్రయించడానికి మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రభుత్వ ప్రమేయం లేకుండానే జరిగింది. అయితే పౌల్‌ పెన్‌ బృందం ప్రస్తుతం తమ వద్ద మాస్క్‌లు లేవని, ఒప్పందం ప్రకారం డబ్బులు వెంటనే చెల్లిస్తే మాస్క్‌లు త్వరలో ఇస్తామని సదరు విదేశీ సంస్థను ఒప్పించారు. మాస్క్‌ల ధర కూడా ప్రస్తుత మార్కెట్‌ ధర కన్నా ఐదు రెట్లు ఎక్కువ ఉన్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చదవండి: హాంకాంగ్‌పై మరింత పట్టు

అయితే ఈ విషయాన్ని గుర్తించిన యూఎస్‌ సీక్రెట్‌ ఏజెన్సీ ఒప్పందానికి సంబంధించిన లావాదేవీలు పూర్తికావడానికి ముందే ఆపేసింది. సంఘటనపై జార్జీయాలోని యూఎస్‌ అటార్నీ బాబీ క్రిస్టిన్‌ మాట్లాడుతూ.. మాస్క్‌ల డిమాండ్‌ దృష్ట్యా కొందరు ఆగంతకులు వాటిని తమకు అవకాశాలుగా మలచుకొని ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. ఈ చర్య క్షమించరానిది' అంటూ క్రిస్టిన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పెన్‌తో పాటు ఈ ఘటనకు సంబంధమున్న మరో ఇద్దరిని గుర్తించే పనిలో ఉన్నారు. స్పెక్ట్రమ్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌సీ ద్వారా పెన్‌ ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరిపినట్లు న్యాయవాదులు తెలిపారు. 2018లో అట్లాంటా శివారు ప్రాంతాల్లో నోర్‌క్రాస్‌లో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. సవన్నాలోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో న్యాయవాదులు దాఖలు చేసిన పత్రాల ప్రకారం.. పాల్‌పెన్‌పై నేర నిరూపణ అయితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.
చదవండి: ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top