ఫ్లాయిడ్‌కు కన్నీటి వీడ్కోలు

George Floyds Funeral Ended In Houston - Sakshi

హ్యూస్టన్‌/వాటికన్‌ సిటీ: పోలీస్‌ అధికారుల దాష్టీకానికి బలైన ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ అంత్యక్రియలు మంగళవారం ఘనంగా ముగిశాయి. వందలాది మంది మద్దతుదారులు ముఖానికి మాస్కులు ధరించి మరీ హ్యూస్టన్‌లోని ఓ చర్చిలో ఫ్లాయిడ్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఫ్లాయిడ్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం కాగా.. అమెరికాలో జాతివివక్షకు ఇకనైనా చరమగీతం పాడాల్సిందేనని పిలుపునిచ్చారు. గత నెల 25న మినియాపోలిస్‌లో డెరెక్‌ ఛావెన్‌ అనే శ్వేతజాతీయుడైన పోలీస్‌ అధికారి అరెస్ట్‌ చేసే క్రమంలో గొంతుపై మోకాలిని ఉంచడం.. దీంతో ఊపిరిఆడక ఫ్లాయిడ్‌ మరణించడం తెలిసిందే.  ప్రజల సందర్శనార్థం ఒక రోజంత ఉంచిన తరువాత మంగళవారం తల్లి సమాధి పక్కనే ఫ్లాయిడ్‌ను ఖననం చేశారు.

ఫ్లాయిడ్‌ హత్యపై స్పందించిన పోప్‌: ఫ్లాయిడ్‌ హత్య అనంతరం జరిగిన ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఆందోళనల్లో అమెరికా బిషప్‌ ఒకరు పాల్గొని, ప్రార్థనలు చేయడాన్ని పోప్‌ ఫ్రాన్సిస్‌ సమర్ధించారు. ఈ సందర్భంగా జార్జ్‌ ఫ్లాయిడ్‌ పేరును రెండు సార్లు ప్రస్తావించారు. సాధారణ పరిస్థితుల్లో శ్వేతజాతి పోలీసు అధికారి చేతుల్లో జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు గురవడం, దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం తదితర ఘటనలపై వాటికన్‌ అంతగా స్పందించదు. కానీ, ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల సంవత్సరం నడుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి బరిలో నిలిచారు. ఈ సమయంలో జాత్యహంకార వ్యతిరేక ప్రదర్శలకు పోప్‌ తదితరులు మద్దతివ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ సారి అమెరికన్‌ కేథలిక్స్‌ ఎవరికి మద్దతివ్వనున్నారనేది చర్చనీయాంశమైంది. (అతడు ఈ ప్రపంచాన్ని మార్చబోతున్నాడు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top