
ట్రంప్ నోటినుంచి మరో కంపు మాట!
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ కోసం జరుగుతున్న డిబేట్‌లో చాలా అథమస్థాయి భాష కనిపిస్తోంది.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్ కోసం జరుగుతున్న డిబేట్‌లో చాలా అథమస్థాయి భాష కనిపిస్తోంది. ముఖ్యంగా రిపబ్లికన్ ఫ్రంట్ రన్నర్ డొనాల్డ్ ట్రంప్ ఈ డిబేట్‌లో ద్వంద్వార్థాలు వచ్చే వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నాడు. తాజాగా ప్రత్యర్థి రుబియోతో జరిగిన సంవాదంలో ట్రంప్ పరోక్షంగా తన పురుషాంగాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం విమర్శలకు గురవుతున్నది.
'సూపర్ ట్యూస్‌డే'లో విజయంతో ఊపుమీదున్న బిలియనీర్ ట్రంప్ తన పోటీదారుడైన రిపబ్లికన్ అభ్యర్థి మార్కో రుబియోపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. కాస్తా పొట్టిగా ఉండే ఫ్లోరిడా సెనేటర్ అయిన రుబియోను ఉద్దేశించి 'లిటిల్ మార్కో' అంటూ ట్రంప్ గతంలో పలుసార్లు ఎద్దేవాపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తాజా డిబేట్‌లో రుబియో విమర్శలు చేశాడు. ట్రంప్ చేతులు చూడండి.. అవి చిన్నవిగా ఉన్నాయంటూ విమర్శించాడు. 'ఈ చర్చావేదికపై ట్రంప్ చాలామందిని పరిహాసించాడు. నిజానికి ఆయనే ఈ విమర్శలకు వందశాతం అర్హుడ'ని రూబియో పేర్కొన్నాడు.
రూబియో వ్యాఖ్యలను ప్రస్తావించిన ట్రంప్ 'ఈ చేతులను చూడండి. ఇవి చిన్నవిగా కనిపిస్తున్నాయా? ఇవి చిన్నవిగా ఉంటే 'ఇంకోటి' కూడా చిన్నదిగా ఉండే అవకాశముంది' అని ట్రంప్ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించాడు. 'ఇందులో సమస్య ఏమీ లేదు. నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను' అని పేర్కొన్నాడు. తన పురుషాంగం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.