ట్రైనింగ్లో లూబిడ్జ్ ఎక్కడికెళ్లాడు? | Sakshi
Sakshi News home page

ట్రైనింగ్లో లూబిడ్జ్ ఎక్కడికెళ్లాడు?

Published Fri, Mar 27 2015 1:56 PM

ట్రైనింగ్లో లూబిడ్జ్ ఎక్కడికెళ్లాడు?

పారిస్: ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జర్మనీ విమానం 'ఎయిర్ బస్ ఏ320'  విమానాన్ని కోపైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశారని తేలిపోవడంతో అతని ఉద్దేశం వెనుక కారణాలేమిటనే అంశంపైనే ప్రస్తుతం దర్యాప్తు కేంద్రీకృతమైంది. లుఫ్తాన్సా విమానయాన సంస్థ తరఫున అమెరికాలోని ఆరిజోనాలో పెలైట్ శిక్షణ పొందిన కోపైలట్ తన శిక్షణ కాలంలో కొన్ని నెలలపాటు శిక్షణకు గైర్హాజరయ్యాడన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఎందుకు లూబిడ్జ్  గైర్హాజరయ్యాడన్న అంశం తేలితే విమానం ప్రమాదం మిస్టరీ వీడిపోయే అవకాశం ఉందని లుఫ్తాన్సా విమానయాన సంస్థ ఉన్నతాధికారి కార్‌స్టెన్ స్పార్ తెలిపారు. పైలట్ శిక్షణ సందర్భంగా సాధారణంగా ఎవరికి లాంగ్ లీవ్ ఇవ్వరని, సిక్‌ లీవ్ మాత్రం ఇస్తారని ఆయన చెప్పారు.

లూబిడ్జ్  సిక్ లీవ్‌పై వెళ్లాడా, లేదా, వెళితే అతని అనారోగ్యానికి కారణాలేమిటో కూపీ లాగాల్సి ఉందని ఆయన అన్నారు. పైలట్ శిక్షణ కేంద్రం నిబంధనలు, జర్మన్ చట్టాల ప్రకారం శిక్షణ పొందుతున్న పైలట్ల సెలవులకు కారణాలు బయటకు వెల్లడించరని, కోర్టు కోరితే తెలపవచ్చని ఆయన తెలిపారు. 2001, సెప్టెంబర్11వ తేదీన అమెరికాలోని పెంటగాన్‌పై హైజాక్ చేసిన విమానంతో దాడి జరిపిన టైస్టు కూడా ఆరిజోనాలోనే పైలట్ శిక్షణ పొందిన విషయం ఇక్కడ గమనార్హం.

ఎయిర్‌బస్ విమానాన్ని కోపైలట్ ఆండ్రియాస్ లూబిడ్జ్ ఆల్ఫ్స్ పర్వతాలపైకి మళ్లించడం, హఠాత్తుగా విమానాన్ని తలకిందులుగా అతివేగంతో కిందకు తీసుకెళ్లి రాళ్లకు ఢీ కొట్టించడం ఉద్దేశపూర్వకంగా జరిగినట్టు బ్లాక్‌బాక్స్ సందేశాల ద్వారా కనుక్కొన్న  విషయం తెల్సిందే. కోపైలట్ ఇలా చేయడానికి రెండే రెండు కారణాలు ఉంటాయని, ఒకటి మానసిక ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, రెండు టైస్టుల ఆదేశాల మేరకు నడుచుకోవడమని కార్‌స్టెన్ చెప్పారు. ఈ రెండు అంశాల్లో కూడా లూబిడ్జ్ను అనుమానించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. అయితే అతని పైలట్ శిక్షణా కాలంలో ఎందుకు అన్ని నెలలు సెలవు పెట్టారు, ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉందని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement