ఒకరు మానేద్దామనుకున్నారు.. ఇంకొకరు ఇప్పుడే మొదలెట్టారు! | Sumeet Sabharwal was days away from quitting flying, Clive Kunder was just starting | Sakshi
Sakshi News home page

ఒకరు మానేద్దామనుకున్నారు.. ఇంకొకరు ఇప్పుడే మొదలెట్టారు!

Jun 14 2025 6:17 AM | Updated on Jun 14 2025 6:17 AM

Sumeet Sabharwal was days away from quitting flying, Clive Kunder was just starting

ముంబై: ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ పైలట్‌ సుమీత్‌ సభర్వాల్‌(56), కో పైలట్‌ క్లైవ్‌ కుందర్‌లది విభిన్నమైన నేపథ్యం. ఒకరు ఎంతో అనుభవశాలి కాగా, మరొకరు ఇప్పుడిప్పుడే కెరీర్‌ను మొదలుపెట్టారు. సభర్వాల్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే యోచనలో ఉండగా, క్లైవ్‌ కుందర్‌ భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. ఫ్లయింగ్‌ అనుభవం వీరిద్దరిదీ కలిపి 9,300 గంటలు కాగా, ఇందులో సభర్వాల్‌ ఒక్కరికే 8,200 గంటల అనుభవముంది. 

పైలట్‌ సుమీత్‌ సభర్వాల్‌(56) ముంబైలోని పొవై ప్రాంతానికి చెందిన జల్‌ వాయు విహార్‌లో వృద్ధులైన తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఎంతో అనుభవం కలిగిన సుమీత్‌కు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటారని పేరుంది. ‘వింగ్‌ కమాండర్‌గా రిటైరయ్యాను. ఎయిరిడింయా సిబ్బందితో కలిసి సుదీర్ఘ కాలం పనిచేశాను. కెప్టెన్‌ సుమీత్‌ ఎంతో మంచివారు. అనుభవశాలి అయిన పైలట్‌. ఆయన మరణం ఎయిరిండియాకు తీరని లోటు’అని సుమీత్‌ ఫ్యామిలీ ఫ్రెండ్‌ సంజీవ్‌ పాయ్‌ చెప్పారు. 

‘సుమీత్‌ పనితీరుపై గానీ, ప్రజలతో వ్యవహరించే తీరుపైగానీ ఎన్నడూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ఆయన ఎంతో సౌమ్యుడు. శాంతిస్వభావి’అని పాయ్‌ అన్నారు. ‘సుమీత్‌ తండ్రి డీజీసీఎ అధికారిగా పనిచేసి, రిటైరయ్యారు. ఆయన కుటుంబంలోని మరో ఇద్దరు సైతం పైలట్లుగా ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సుమీత్‌ పైలట్‌ అయ్యారు. అయితే, 82 ఏళ్ల వృద్ధుడైన తండ్రి బాగోగులను చూసుకునేందుకు ఉద్యోగం మానేయాలనుకుంటున్నట్లు కొన్ని రోజుల క్రితం సుమీత్‌ నాతో అన్నారు’అని పాయ్‌ వివరించారు.

కో–పైలట్‌ క్లైవ్‌ కుందర్‌కు 1,100 గంటల ఫ్లయింగ్‌ అనుభవముంది. క్లైవ్‌ తల్లి ఫ్లయిట్‌ క్రూ సభ్యురాలు. ముంబై జుహులోని బాంబే ఫ్లయింగ్‌ క్లబ్‌లో క్లైవ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ కోర్సు పూర్తి చేశారు. ఏరోనాటికల్‌ ఇంజినీర్‌గా ఏడాదికి పైగా పనిచేశారు. కలినాలోని ఎయిరిండియా కాలనీలో క్లైవ్‌ పెరిగాడు. అనంతరం వీరి కుటుంబం బొరివలికి మకాం మార్చింది. 

కుందర్‌ పైలట్‌ కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు ఎయిరిండియాలో చేరారని పొరుగునుండే ఫ్లాయిడ్‌ డిసౌజా చెప్పారు. ఎంతో సరదాగా అందరినీ నవ్విస్తుండే క్లైవ్‌ కుందర్‌కు, ఆయన తండ్రి క్లిఫ్పర్డ్‌కు ఆటలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. క్లైవ్‌ ఖాళీ దొరికితే చాలు క్రికెట్‌ ఆడేవారని చెప్పారు. విషాదం తెల్సిన వెంటనే ఆస్ట్రేలియాలో ఉంటున్న క్లైవ్‌ సోదరి క్లైన్, తల్లి రేఖ ఇండియాకు బయలుదేరారని ఫ్లాయిడ్‌ అన్నారు. క్లైవ్‌ కుందర్‌ మృతిపై నటుడు విక్రాంత్‌ మస్సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement