అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో పారిస్ పర్యావరణ ఒప్పందంలో ఆ దేశం పాలుపంచుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మారకేచ్(మొరాకో): అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో పారిస్ పర్యావరణ ఒప్పందంలో ఆ దేశం పాలుపంచుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఆ ఒప్పందాన్ని బూటకంగా వర్ణించి తాను గెలిస్తే దాన్ని రద్దుచేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించడం తెలిసిందే. ప్రస్తుతం మొరాకాలో జరుగుతున్న యూఎన్ పర్యావరణ సదస్సులో ట్రంప్ విజయం సాధించారన్న వార్త ప్రకంపనలు సృష్టించింది. చిన్న దీవుల దేశాల తరుఫున మాల్దీవులు పర్యావరణ మంత్రి స్పందిస్తూ పర్యావరణ సవాళ్లు, క్లీన్ ఎనర్జీ దిశగా వస్తున్న మార్పును అమెరికా కొత్త అధ్యక్షుడు దీటుగా ఎదుర్కోవాలని అన్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలతో పర్యావరణ వేత్తలు కంగుతిన్నారు.
‘పర్యావరణ ప్రణాళికకు ట్రంప్ బ్రేక్ వేస్తారు. మనమంతా దీనికి విరుగుడు కనుగొనాలి’ అని పర్యావరణ సంస్థ 350. ఆర్గ్ ప్రతినిధి బోఈవ్ అన్నారు. అమెరికా ఈ ఒప్పందం నుంచి ఉపసంహరించుకోవాలనుకుంటే మొత్తం ప్రక్రియ పూర్తవడానికి నాలుగేళ్లు పడుతుంది. కాలుష్య స్థాయులును గణనీయంగా తగ్గిస్తామన్న ఒబామా ప్రభుత్వం హామీని ట్రంప్ పెడచెవిన పెట్టే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఒప్పందం నుంచి తప్పుకుంటే భవిష్యత్తు పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది స్పష్టం కావట్లేదు.