
300% పెరిగిన సైబర్ నేరాలు
ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు దడ పుట్టిస్తున్నాయి. భారత్ లక్ష్యంగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దేశంలో 2011-14 మధ్య మూడేళ్ల కాలంలో సైబర్ నేరాలు ఏకంగా 300 శాతం పెరిగాయి.
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు దడ పుట్టిస్తున్నాయి. భారత్ లక్ష్యంగా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దేశంలో 2011-14 మధ్య మూడేళ్ల కాలంలో సైబర్ నేరాలు ఏకంగా 300 శాతం పెరిగాయి. విస్తరిస్తున్న అంతర్జాలం... అరచేతిలో స్మార్ట్ ఫోన్ల మాయాజాలంతో ఈ తరహా నేరాలు ఏటికేడూ ఆందోళనకర స్థాయిలో అధికమవుతున్నట్టు అసోచామ్-పీడబ్ల్యూసీ అధ్యయనంలో తేలింది. ఎక్కువగా అమెరికా, టర్కీ, చైనా, బ్రెజిల్, పాకిస్తాన్, అల్జీరియా, యూఏఈ, యూరప్‌ల నుంచి హ్యాకింగ్‌లకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. 2000 ఐటీ చట్టం కింద 2011-14 మధ్య కాలంలో 300 శాతం అధికంగా సైబర్ కేసులు నమోదైనట్టు ‘ప్రొటెక్టింగ్ ఇంటర్‌కనెక్టెడ్ సిస్టమ్స్ ఇన్ సైబర్ ఎరా’ పేరిట నిర్వహించిన ఈ అధ్యయనం పేర్కొంది.
అణు కర్మాగారాలు, రైల్వే, ఇతర రవాణా వ్యవస్థలు, ఆసుపత్రుల వంటివాటిపై నేరగాళ్లు గురిపెట్టారు. దీనివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం, నీటి కలుషితం, వరద, రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం వంటి భయంకర పరిణామాలు చోటుచేసుకొంటున్నట్టు గుర్తించింది. ‘భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ 2015లో భద్రతకు సంబంధించి 50 వేల సమస్యలను పరిష్కరించినట్టు ఈ సందర్భంగా అధ్యయనం పేర్కొంది. వ్యక్తిగత, ప్రభుత్వ, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది.