అమెరికాలో మృత్యుఘోష

COVID-19: US becomes first country to mark 2000 Lifeloss in 24 hours - Sakshi

ఒకే రోజు రెండు వేలు దాటిన కోవిడ్‌ మరణాలు

40 మందికి పైగా ఇండియన్‌ అమెరికన్లు మృతి  

వాషింగ్టన్‌/వూహాన్‌/లండన్‌/ఇస్తాంబుల్‌: అమెరికాలో కోవిడ్‌–19 విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 18,860 మంది మృతి చెందారు. ప్రాణాంతక ఈ వైరస్‌ సోకి 40 మందికి పైగా భారతీయ సంతతికి చెందిన వారు మరణించారు. వీరిలో12 మంది వరకు భారతీయ పౌరులు ఉన్నట్టు తెలుస్తోంది. కోవిడ్‌తో కన్నుమూసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఇద్దరు, కేరళకు చెందిన వారు 17 మంది, గుజరాతీయులు 10 మంది, నలుగురు పంజాబీయులు, ఒడిశాకు చెందిన వారు ఒకరు ఉన్నారు.

మృతుల్లో అత్యధికులు 60 ఏళ్లకు పై బడిన వారే. 21 ఏళ్ల వయసున్న వ్యక్తి కూడా మృతుల్లో ఉన్నారు. న్యూయార్క్‌లో వెయ్యి మందికిపైగా, న్యూజెర్సీలో 400 మందికి పైగా ఇండియన్‌ అమెరికన్లకు వైరస్‌ సోకింది. కోవిడ్‌ బాధితులకు సాయం చేయడానికి ఇప్పటికే పలు ప్రవాస భారతీయ సంస్థలు రంగంలోకి దిగాయి. స్థానిక యంత్రాంగంతో కలిసి తమ వంతు సాయం అందిస్తున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీలోని మినీ ఇండియాగా పిలిచే ఓక్‌ ట్రీ రోడ్డులో మృతుల సంఖ్య అత్యధికంగా ఉంది.

న్యూయార్క్‌లో 15 మంది, న్యూజెర్సీలో 12 మందికి పైగా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియాలో నలుగురు చొప్పున, టెక్సాస్, కాలిఫోర్నియాలో ఒక్కొక్కరు మరణించినట్టు అమెరికాలో స్థానిక అధికారులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ఓక్‌ ట్రీ రోడ్డులో వ్యాపారం చేస్తున్న ప్రవాస భారతీయుడు భవేష్‌ దవే అన్నారు. ప్రాణాలు కోల్పోయిన భారతీయుల్లో సున్నోవా అనలిటికల్‌ సీఈవో మారేపల్లి హనుమంతరావు, న్యూజెర్సీ పారిశ్రామికవేత్త చంద్రకాంత్‌ అమిన్‌(75), మహేంద్ర పటేల్‌ (60) ఉన్నారు.

మరికొందరు భారతీయుల పరిస్థితి విషమంగా ఉండడంతో ప్లాస్మా డోనర్ల కోసం పలు ప్రవాస భారతీయ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు న్యూజెర్సీలో ఉంటున్న నీల పాండ్య అనే గుజరాతీ మహిళ తన కుటుంబానికి చెందిన అయిదుగురు కోవిడ్‌తో పోరాడుతున్నారని, బెడ్స్‌ కొరత కారణంగా వారిలో ఇద్దరినే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకున్నారంటూ ఆమె ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. కోవిడ్‌ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని, నిర్లక్ష్యం వద్దంటూ ఆమె పెట్టిన వీడియో భారతీయ సంతతి వారిలో గుబులు రేపుతోంది. మరోవైపు అమెరికా ఒకే రోజు 2,104 మరణాలు నమోదైన తొలి దేశంగా నిలిచింది.

యూకేకి పారాసెటమాల్‌ మాత్రలు  
యూకేకి తొలి విడతగా 30 లక్షల పారాసెటమాల్‌ ప్యాకెట్లు ఆదివారం చేరుకోనున్నాయి. కోవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మందుల ఎగుమతులపై ఆంక్షల్ని తొలిగించిన భారత ప్రభుత్వం వెంటనే పారాసెటమాల్‌ ట్యాబ్లట్లను పంపింది.ఈ మందులు ఆదివారానికి చేరుకుంటాయని బ్రిటన్‌ విదేశాంగ శాఖ అధికారి వెల్లడించారు. కోవిడ్‌తో బాధపడుతున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆరోగ్యం మరింత మెరుగుపడిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  

కోవిడ్‌ను జయించిన 93 ఏళ్ల అవ్వ
టర్కీకి చెందిన 93 ఏళ్ల వయసున్న అల్యే గుండాజ్‌ కోవిడ్‌ను జయించారు. పది రోజుల పాటు కోవిడ్‌తో పోరాటం చేసిన ఆమె ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు. ఇస్తాంబుల్‌ ఆస్పత్రి నుంచి ఆ వృద్ధురాలిని డిశ్చార్జ్‌ చేసిన సమయంలో అందరిలోనూ ఈ మహమ్మారిని ఎదుర్కోగలమన్న ఆశాభావం కలిగింది.. వైద్య సిబ్బంది చేసిన కృషికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.  

చైనాలో మళ్లీ వైరస్‌ భయం
కరోనా వైరస్‌ భయం మళ్లీ చైనాలో మొదలైంది. కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి వందలాది మంది చైనీయులు తిరిగి స్వస్థలాలకు చేరుకోవడంతో వారి ద్వారా రెండోసారి వైరస్‌ విజృంభిస్తుందనే ఆందోళనలో ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సోకిన కేసులు 1,183కి చేరుకోవడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

ఈ అంకెలు శనివారం రాత్రి 11 గంటలకు..
ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు: 17,16,674
మరణాలు                             :1,07,637
కోలుకున్న వారు                    : 3,95,586 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top