
బీజింగ్ : చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 811కి చేరింది. శనివారం ఒక్కరోజే 89 మంది మహమ్మారితో పోరాటం చేస్తూ జీవితాన్ని కోల్పోయారు. వీరిలో 81 మంది వైరస్‌కు కేంద్రంగా ఉన్న హుబెయ్ ప్రావిన్సు నుంచే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. చైనాలో మొత్తం 37,198 మందికి కరోనా వైరస్ సోకిందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది.
ప్రపంచాన్ని విలవిల్లాడించిన సార్స్ వైరస్ మృతుల సంఖ్యను, కరోనా వైరస్ మృతుల సంఖ్య అధిగమించడం ఆందోళన కలిగిస్తోంది. 2002-2003 మధ్య సార్స్ వైరస్ 774 మందిని బలిగొంది. కరోనా కారణంగా చైనా వెలుపల ఇద్దరు మరణించారు. హాంగ్ కాంగ్‌లో ఒకరు, ఫిలిప్ఫిన్స్‌లో మరొకరు మృతిచెందగా, భారత్ సహా 25 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.