చొచ్చుకువచ్చిన చైనా సైనిక హెలికాఫ్టర్‌

Chinese Military Helicopter Violates Indian Airspace In Uttarakhand - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనా సైనిక విమానం సోమవారం నియంత్రణ రేఖను దాటి భారత గగనతలంలోకి చొచ్చుకురావడం కలకలం రేపింది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బరహోటి ప్రాంతంలో చైనా మిలటరీ హెలికాఫ్టర్‌ చక్కర్లు కొట్టింది. గగనతల నిబంధనలను ఉల్లంఘించి చైనా సైనిక హెలికాఫ్టర్‌ భారత గగనతలంలోకి ఎలా వచ్చిందనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మరోవైపు డోక్లాం వివాదం నేపథ్యంలో ఇరు దేశాలు ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. డోక్లాం వ్యవహారంలో చైనా దూకుడు పెంచడంతో భారత్‌ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

గత నెలరోజుల్లో చైనా హెలికాఫ్టర్లు మన గగనతలంలోకి చొచ్చుకురావడం ఇది నాలుగోసారి. ఈనెల 10న మూడు చైనా సైనిక హెలికాఫ్టర్లు బరహోతిలో ప్రవేశించాయి. నాలుగు కిలోమీటర్ల మేర భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన చాపర్లు దాదాపు ఐదు నిమిషాల పాటు చక్కర్లు కొట్టాయి.

మార్చి 8న లడఖ్‌లో రెండు చైనా హెలికాఫ్టర్లను గుర్తించారు. భారత గగనతలంలోకి 18 కిమీ లోపలికి అవి చొచ్చుకువచ్చాయి. ఫిబ్రవరి 27న చైనా హెలికాఫ్టర్‌ లడఖ్‌లనో డెసాంగ్‌, ట్రిగ్‌ హైవే చేరువలో 19 కిలోమీటర్లలోపలికి భారత గగనతలంలోకి వచ్చి కొద్దిసేపు చక్కర్లు కొట్టింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top