రూ.200 కోసం! | Sakshi
Sakshi News home page

రూ.200 కోసం!

Published Sun, Aug 5 2018 11:55 AM

hinese man washes car in river to save - Sakshi

మన కారో.. బైకో నెలకోసారైనా వాటర్‌ సర్వీసింగ్‌కు ఇస్తుంటాం. అయితే ఆ డబ్బులు ఎందుకు వృథా చేయడం అనుకున్నవారు ఏం చేస్తారు. ఇంట్లోనే బకెట్లో నీరు తీసుకుని ఎంచక్కా పొద్దున్నే శుభ్రం చేసుకుంటారు. అయితే ఓ చైనీయుడు మాత్రం రూ.200ను ఆదా చేసుకునేందుకు ఓ చెత్త ఆలోచన చేశాడు. ఆ తర్వాత నాలుక్కరుచుకున్నాడు. చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఖరీదైన ల్యాండ్‌రోవర్‌ ఎస్‌యూవీని కడుక్కోవాలనుకున్నాడు. అయితే అందుకు రూ.200 ఖర్చు అవుతుందని వెనుకడుగు వేశాడు. అంతేకాదు ఎంచక్కా తనే శుభ్రం చేయాలని భావించాడు. అదేదో తన ఇంటిలోనే కడిగితే ఇది వార్తే కాదు. ఇంతకీ అతడేం చేశాడంటే.. దగ్గర్లో ఉన్న నదిలో కారును శుభ్రం చేయాలని భావించాడు.

 అనుకున్నదే తడవు అక్కడికి వెళ్లి ఒడ్డుకు దగ్గరగా తక్కువ ప్రవాహం ఉన్న ప్రాంతంలోకి కారును దింపి.. శుభ్రం చేసుకుంటున్నాడు. అయితే అప్పుడే పక్కనే ఉన్న డ్యాం నుంచి గేట్లు తెరిచారు. దీంతో ఆ కారున్న చోటికి నీటి ప్రవాహం పెరిగింది. వెంటనే మనోడు పక్కనే ఉన్న ఓ బండరాయిపైకి చేరుకున్నాడు. కానీ వెళ్లిపోతున్న కారును తీసుకురాలేకపోయాడు. వెంటనే అక్కడున్న జనం ఫైర్‌ సిబ్బందికి ఫోన్‌ చేయడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని కారును ఒడ్డుకు చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టడంతో నెటిజన్లు జోకుల మీద జోకులు పేలుస్తున్నారు. పాపం రూ.200ల కోసం చూసుకుంటే దాదాపు 50 లక్షల కారును పోగొట్టుకునే వాడు పాపం! 

Advertisement
Advertisement