చెంఘీజ్‌ఖాన్‌నే అవమానిస్తావా?

Chinese man jailed for insulting Genghis Khan's portrait  - Sakshi

బీజింగ్‌: మంగోల్‌ సామ్రాజ్యాధినేత చెంఘీజ్‌ఖాన్‌ చిత్రపటాన్ని కాలితో తొక్కి అవమానించడంతో పాటు దాన్ని వీడియోతీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌చేసిన ఓ చైనా పౌరుడికి ఏడాది జైలుశిక్ష పడింది. చైనాలో స్వయంప్రతిపత్తి గల ఇన్నర్‌ మంగోలియాలోని ఇన్‌చువాన్‌ నగరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లువో అనే వ్యక్తి మే నెలలో చెంఘీజ్‌ఖాన్‌ చిత్రపటాన్ని తొక్కడంతో పాటు ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లువోపై జాతుల మధ్య విద్వేషం, వివక్ష పెంచేందుకు కుట్రపన్నాడని కేసు నమోదుచేసిన పోలీసులు..అతడిని అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపర్చారు. మంగళవారం జరిగిన విచారణలో లువో తన నేరాన్ని అంగీకరించడంతో కోర్టు అతనికి ఏడాది జైలుశిక్ష విధించింది. మంగోల్‌ రాజ్య వ్యవస్థాపకుడైన చెంఘీజ్‌ను మంగోల్‌ జాతి ప్రజలు అత్యంత గౌరవిస్తారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top