పాకిస్తాన్‌కు చైనా బిగ్‌ షాక్‌

China stops funding CPEC road projects in Pakistan - Sakshi

సీపీఈసీ ప్రాజెక్ట్‌కు నిధులు నిలివేత

అవినీతి జరిగిందనే ఆరోపణలు

అయోమయంలో ఎకనమిక్‌ కారిడార్‌

న్యూఢిల్లీ : అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా భావించే పాకిస్తాన్‌కు చైనా ఊహించని షాక్‌ ఇచ్చింది. చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా పాకిస్తాన్‌లో నిర్మించే మూడు రహదారి ప్రాజెక్టులకు నిధులు నిలిపివేస్తున్నట్లు చైనా మంగళవారం ప్రకటించింది. సీపీఈసీ ప్రాజెక్ట్‌ను చైనా 50 బిలియన్‌ డాలర్లతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్‌లో నిర్మించే మూడు రహదారి ప్రాజెక్టుల నిర్మాణానం మూడు నెలలుగా నత్తనడకన సాగుతోంది. పనుల్లో వేగం లేకపోవడంతోనే చైనా ఈ నిర్ణయం తీసుకుందని పాకిస్తాన్‌ పత్రిక డాన్‌ పేర్కొంది. చైనా ప్రభుత్వ నిర్ణయంతో పాకిస్థాన్ నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌‌హెచ్ఏ) చేపట్టిన  ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇదిలా ఉండగా.. సీపీఈసీ ప్రాజెక్ట్‌ నిధులకు సం‍బంధించి నూతన విధివిధానాలు ఖరారు అయ్యే వరకూ నిధులను నలిపేస్తున్నట్లు చైనా ఉన్నతాధికారులు ప్రకటించారు.

చైనా నిధుల నిలిపివేతపై పాకిస్తాన్‌ అధికారులు మరోలా స్పందిస్తున్నారు. పాకిస్తాన్‌ అంటే గిట్టనివారు కొందరు సీపీఈసీ ప్రాజెక్ట్‌లో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నట్లు చైనాను తప్పుదోవ పట్టించారని పాకిస్తాన్‌ చెబుతోంది. సీపీఈసీలో అవినీతి జరుగుతోందన్న అనుమానాలతోనే చైనా నిధులను నిలిపేసిందని పాకిస్తాన్‌ భావిస్తోంది.

చైనా చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని బలూచిస్తాన్‌ నుంచి చైనాలోని జింజియాంగ్‌ ప్రాంతాలను కలుపుతుంది.  ప్రస్తుతం నిధుల నిలిపివేతతో ఈ ప్రాంతంలోని డేరా ఇస్మాయిల్‌ ఖాన్‌ నుంచి జహాబ్‌ మధ్యనున్న 214 కి.మీ. రహదారి పనులు నిలిచిపోతాయి. అలాగే ఖుజ్దార్‌ నుంచి బైసిమా మధ్య 110 కి.మీ, కారాకోరం హైవే మీద నిర్మించే రహదారి పనులు ఇబ్బందుల్లో పడతాయి.  

వాస్తవంగా ఈ ప్రాజెక్టులు పాకిస్తాన్‌ ప్రభుత్వ సొంత అభివృద్ధి కార్యక్రమంలోనివి కావడం గమనార్హం. ఈ రహదారులు కూడా సీపీఈసీ ప్రాజెక్ట్‌లోకి రావడంతో.. వీటికి కూడా చైనా నిధులు మంజూరు చేసింది. అయితే ప్రాజెక్టులో అవినీతి పెరిగిపోవడంతో.. చైనా నిధులు నిలిపేసింది.  సీపీఈసీలో భాగంగా నిర్మిస్తున్న రహదారులపై చైనా నిధులు నిలిపేయడంపై పాకిస్తాన్‌ ఆశ్చర్యానికి, ఒకింత షాక్‌కు గురయినట్లు తెలుస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top