దక్షిణ చైనా సముద్ర వివాదం.. స్పందించిన చైనా

China Says US Accusations On South China Sea Are Unjustified - Sakshi

బీజింగ్‌: సరిహద్దు దేశాలతో కయ్యాని​కి కాలు దువ్వే చైనాకు షాక్‌ ఇవ్వడానికి అమెరికా దక్షిణ చైనా సముద్రంలోకి యుద్ధ నౌకలను తరలించిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో దక్షిణ చైనా విషయంలో అమెరికా చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అన్యాయమైనవని డ్రాగన్‌ దేశం పేర్కొంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా పొరుగుదేశాలను బెదిరిస్తోందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను కూడా చైనా ఖండించింది. ఈ మేరకు ‘దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా కల్పించుకోవడం ఆమోదయోగ్యంగా లేదు. ఈ వివాదంలో అమెరికాకు సంబంధం లేదు. అలాంటప్పుడు ఈ అంశంలో తలదూర్చడం సమంజసం కాదు’ అంటూ అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాక స్థిరత్వం కాపాడాలనే నెపంతో అమెరికా ఈ అంశంలో ఉద్రిక్తతలను రేకెత్తిస్తుంది అని చైనా విమర్శించింది. (అందరూ కరోనా బిజీలో ఉంటే.. చైనా మాత్రం)

దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్​ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి. ఈ క్రమంలో చైనా దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాలకు ప్లాన్‌ చేసుకుంది. డ్రాగన్‌ కంట్రీని కట్టడి చేసేందుకు అమెరికా యుద్ధ విన్యాసాలను నిర్వహించడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతిభద్రతలకు కట్టుబడి ఉంటామని మా భాగస్వాములకు తెలియజేసేందుకే ఈ విన్యాసాలు చేపడుతున్నాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే, తాము చేయబోయే యుద్ధ విన్యాసాలకు, చైనా యుద్ధ విన్యాసాలు కారణం కాదని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top