అమెరికా విచారణకు చైనా నో!

China rejects Trump demand to probe corona virus in Wuhan - Sakshi

తాము బాధితులమే తప్ప నేరస్తులం కాదన్న డ్రాగన్‌ దేశం

హెచ్‌ఐవీ, హెచ్‌1ఎన్‌1ల పుట్టిల్లు అంటూ అమెరికాపై ఎదురుదాడి

బీజింగ్‌/ప్యారిస్‌/కరాచీ: కరోనా వైరస్‌ పుట్టుకపై విచారణకు తమ దేశ బృందాలను అనుమతించాలంటూ అమెరికా అధ్యక్షుడు  ట్రంప్‌ చేసిన డిమాండ్‌ను చైనా సోమవారం తోసిపుచ్చింది. మేము కరోనా బాధితులమేగానీ, నేరస్తులం కాదంటూ స్పష్టం చేసింది.  వూహాన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పినా ఆ దేశం నుంచి స్పందన లేదని ఆదివారం ట్రంప్‌ వ్యాఖ్యానించడం తెల్సిందే. కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌లో ఒక పరిశోధనశాల నుంచి తప్పించుకుందా? అనే కోణంలో అమెరికా విచారణ ప్రారంభించింది.

ఈ పరిణామాలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ సోమవారం స్పందిస్తూ.. ‘వైరస్‌ మానవాళి మొత్తానికి శత్రువు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రత్యక్షం కావచ్చు. ఏ దేశంపైనైనా విరుచుకు పడవచ్చు. మేమూ బాధితులమే. నేరస్తులం కాదు. ఈ వైరస్‌ను తయారు చేసిన వాళ్లలో మేము లేము’అని అన్నారు. సకాలంలో వైరస్‌ సమాచారం ఇవ్వని చైనాపై చర్యలు తీసుకోవాలని అమెరికా నేతలు డిమాండ్‌ చేయడంపై గెంగ్‌ మాట్లాడుతూ..‘వూహాన్‌లో తొలిసారి వైరస్‌ను గుర్తించింది మొదలు ఇప్పటివరకూ చైనా అన్ని అంశాలను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తోంది.

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటోంది’అని తెలిపారు. వైరస్‌ కట్టడికి సంబంధించి చైనా అంతర్జాతీయ సమాజానికి విలువైన సమాచారాన్ని ఇచ్చిందని చెప్పారు. ప్రపంచవ్యాప్త మరణాలకు చైనాపై దావా వేయాలన్న అమెరికా నేతల మాటలకు స్పందిస్తూ.. ఇలాంటి ఘటన ఏదీ గతంలో జరగలేదని, 2009లో హెచ్‌1ఎన్‌1 అమెరికాలో బయటపడిందని, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, 2008 నాటి ఆర్థిక సంక్షోభం అమెరికాలో మొదలై ప్రపంచాన్ని కుదిపేశాయని గెంగ్‌ గుర్తు చేశారు. అప్పట్లో ఎవరైనా అమెరికా బాధ్యత ఏమిటని అడిగారా? అని ప్రశ్నించారు. కరోనా వైరస్‌పై చైనాలో అంతర్జాతీయ బృందం ఒకటి విచారణ జరపాలన్న ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలమంత్రి మరైస్‌ పేన్‌ పిలుపును గెంగ్‌ కొట్టివేశారు..

యూరప్‌లో 11లక్షల మందికి..
యూరప్‌ మొత్తమ్మీద 11.83 లక్షల మందికి కరోనా వైరస్‌ సోకింది. సోమవారం వరకూ దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసియాలో 1.66 లక్షల మంది కోవిడ్‌–19తో బాధపడుతూంటే సుమారు ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

► పాకిస్తాన్‌లోని సింధ్‌లో ఓ నిండు గర్భిణి ఆకలికి బలైంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో సుగ్రా బీబీ(30) గత వారం మరణించినట్లు వార్తలొచ్చాయి. దినసరి కూలీలమైన తమకు లాక్‌డౌన్‌ కారణంగా పని దొరకలేదని, ఆరుగురు పిల్లలున్న తమ కుటుంబానికి ఆహారం అందడం కష్టమైందని సుగ్రా భర్త చెప్పాడు.

కేసులు తగ్గాయి: చైనా
తమదేశంలో కొత్తగా కరోనా కేసులు తగ్గిపోతున్నాయని చైనా తెలిపింది. తాజాగా మొత్తం 12 కొత్త కేసులు బయటపడగా ఇందులో 8 విదేశాల నుంచి వచ్చిన చైనీయులవేనని అధికారులు చెప్పారు. చైనాలో ఆదివారం కోవిడ్‌ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇదే సమయానికి విదేశాల నుంచి వచ్చిన చైనీయులు 1,583 మందికి వ్యాధి సోకింది. వీరిలో 43 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top