రోడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టిన డ్రాగన్‌

China To Lay 1.3 Million Kms Of  Roads By 2020 To Help PLA: Pentagon - Sakshi

2020 నాటికల్లా 13 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం

26 వేల కిలోమీటర్లు మేర ఎక్స్‌ప్రెస్‌వే

వీటి ద్వారా చైనా మిలిటరీని త్వరితగతిన తరలిచేందుకు అవకాశం

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అతి పెద్ద మిలిటరీ శక్తిని కలిగి ఉన్న చైనా ఇప్పుడు రోడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)గా పిలిచే చైనా మిలిటరీని ఒక చోట నుచి మరోక చోటికి త్వరితగతిన తరలించేందుకు ఆ దేశం 2020 నాటికల్లా 13 లక్షల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్ష కిలోమీటర్ల మేర రైల్వే మార్గంతో పాటుగా గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణం చేయగల 10 వేల కిలోమీటర్ల మేర హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌ను చైనా కలిగి ఉన్నట్లు ‘చైనా మిలిటరీ పవర్‌’నివేదికలో పేర్కొన్నట్లు పెంటగాన్‌ యూఎస్‌ కాంగ్రెస్‌కు వెల్లడించింది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నిధుల కేటాయింపులే లక్ష్యంగా బీజింగ్‌ పనిచేస్తోందని తెలిపింది.

రవాణా మార్గాల అభివృద్ధి ద్వారా భవిష్యత్తులో పీఎల్‌ఏ భారీ ఎత్తున తన బలగాలను వేగంగా తరలించేలా చైనా ప్రణాళికలు రూపొందించింది. దీంతోపాటుగా స్వదేశీ యుద్ధవిమానాలను అభివృద్ధి చేయడంతో పాటుగా దక్షిణ చైనా సముద్ర భాగంలోని ద్వీపాల్లో మిలిటరీ అవుట్‌పోస్టుల నిర్మాణం కూడా చేస్తోంది. చైనాలో ఉన్న విమానాశ్రయాల్లో 1/3 వంతు ఎయిర్‌పోర్టులు అటు మిలిటరీకీ, ఇటు పౌరులకు ఉపయుక్తమైనవిగా ఆ దేశం నిర్మించింది. ఇక అంతరిక్షంలో ఆధిపత్యం కోసం పీఎల్‌ఏ కసరత్తులు చేస్తోందని పెంటగాన్‌ కార్యాలయం యూఎస్‌ కాంగ్రెస్‌కు నివేదించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top