బైక్‌లకే బాద్‌ షా

This bike is a specialty of helmet and jacket - Sakshi

‘ఆర్క్‌’ కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్‌ ట్రూమన్‌ ఇదేచెబుతున్నారు.. హాలీవుడ్‌ సూపర్‌ హీరో సినిమాల్లోని హైఫై బైక్‌లకు ఇది ఏమాత్రం తీసిపోదంటున్నారు.. వాళ్లలా బలం రాకపోవచ్చు గానీ.. దీన్ని నడుపుతుంటే.. మనం కూడా సూపర్‌ హీరోల్లా ఫీలైపోవచ్చని చెబుతున్నారు..మార్క్‌ చెబుతున్నదాన్ని బట్టి ఇది ప్రపంచంలోనే అత్యాధునికమైన బైక్‌.. బ్రిటన్‌లోని కోవెంట్రీకి చెందిన ‘ఆర్క్‌’ కంపెనీలోనిఅత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం దీన్ని తయారుచేసింది. ఈ బైక్‌.. దీనితోపాటు వచ్చే హెల్మెట్, జాకెట్‌ అన్నీ ప్రత్యేకమైనవేనట.  ఇంతకీ ఏంటివీటి స్పెషాలిటీ.. ఓ లుక్కేద్దాం 

హెల్మెట్‌
ఐరన్‌ మ్యాన్‌ సినిమా చూశారా..అందులో హీరో బుర్రకు వేసుకునే హెల్మెట్‌ తెరపై రూట్‌ మ్యాప్‌లు ఇలా అన్ని వివరాలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇందులో కూడా దాదాపు అలాగే ఉంటుంది. హెల్మెట్‌లో ఉండే బుల్లితెరపై బైక్‌ వెళ్తున్న వేగం.. వెళ్లాల్సిన ప్రదేశం తాలూకు మ్యాప్‌ ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ప్రదర్శితమవుతూ ఉంటుంది. బుర్రతిప్పాల్సిన పని లేకుండా.. వెనకేం జరుగుతోందన్న విషయాన్ని ఇందులో ఉండే కెమెరా తెరపై డిస్‌ప్లే చేస్తుంది. 

జాకెట్‌
హ్యూమన్‌ మెషీన్‌ ఇంటర్‌ఫేస్‌(హెచ్‌ఎంఐ)టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. మనం అతి వేగంగాప్రయాణించినా.. డ్రైవింగ్‌లో తేడా ఉన్నా.. బ్రేక్‌లు లేదా బైక్‌లో ఏదైనా లోపాలు ఉన్నట్లు అనిపించినా.. ప్రమాద సంకేతాలుకనిపించినా.. ఇది వెంటనే వైబ్రేట్‌ అయి అప్రమత్తం చేస్తుంది.అంతేకాదు.. వెళ్తూవెళ్తూ మీకు నచ్చిన పాటలు వినే ఏర్పాటు కూడా ఇందులో ఉంది.

బైక్‌ ఇది ఎలక్ట్రిక్‌ బైక్‌..
పర్యావరణ అనుకూలమైనది. తక్కువ బరువుఉండటానికిగానూ చాలా భాగాలను కార్బన్‌ ఫైబర్‌తో తయారుచేశారు. ఎలక్ట్రిక్‌ పవర్‌ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. అత్యధిక వేగం గంటకు 193 కిలోమీటర్లు. ఒక్కసారి ఫుల్‌గా చార్జ్‌ చేస్తే.. 320 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. ఫుల్‌ చార్జింగ్‌కు 45 నిమిషాలు పడుతుంది. దీన్ని కొన్నవాళ్లకు వాళ్ల ఇంటి వద్దే ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ పాయింట్‌ను కంపెనీ వాళ్లు ఏర్పాటు చేస్తారు. అయితే, దీన్ని డబ్బున్న కామన్‌ మ్యాన్‌లే కొనగలరు.. బైక్‌ ధర రూ.80 లక్షలు! 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top