ఐసిస్ వీడియోలో టాప్ మోడల్ మాజీ భర్త
హోలీ బెస్ట్ బేకరిలో నరమేధం సృష్టించిన తర్వాత ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) విడుదల చేసిన వీడియోలో బంగ్లాదేశ్ టాప్మోడల్ నైలా నయెమ్ మాజీ భర్త తుషార్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఢాకా: హోలీ బెస్ట్ బేకరిలో నరమేధం సృష్టించిన తర్వాత ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) విడుదల చేసిన వీడియోలో బంగ్లాదేశ్ టాప్మోడల్ నైలా నయెమ్ మాజీ భర్త తుషార్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఢాకాలో దాడికి పాల్పడిన ఐసిస్ ఉగ్రవాదులను ప్రశంసిస్తూ ముగ్గురు వ్యక్తులు బంగ్లా భాషలో మాట్లాడిన వీడియోను మంగళవారం ఇంటర్నెట్లో పెట్టారు. మరిన్ని దాడులకు పాల్పడుతామని ఈ వీడియోలో హెచ్చరించారు.
బాగా పెరిగిన గడ్డంతో తుషార్ ఈ వీడియోలో కనిపించాడు. దంత వైద్యుడైన అతడు గత రెండేళ్ల నుంచి కనిపించకుండా పోయాడు. అతడి తండ్రి వషీకుర్ ఆజాద్ బంగ్లాదేశ్ ఆర్మీలో మేజర్గా పనిచేశారు. ఢాకాలోని బరిదర డిఫెన్స్ ఆఫీర్స్ హౌసింగ్ కాలనీలో నివసించిన తుషార్ 2011లో నైలా నయెమ్ను పెళ్లాడు. తర్వాత వారిద్దరూ విడిపోయారు.
వీడియోలో కనిపించిన మరో వ్యక్తిని ఢాకా వర్సిటీ విద్యార్థి త్వాసిఫ్ హుస్సేన్ గా గుర్తించారు. జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)తో సంబంధాలున్నాయనే ఆరోపణతో గతంలో అతడిని అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అతడిని తల్లిదండ్రులు ఆస్ట్రియాకు పంపించారు. మూడో వ్యక్తిని తమీమ్ రహ్మాన్ షఫీగా గుర్తించారు. ఈ వీడియోను సిరియా రాజధాని అల్-రఖాలో రికార్డు చేసినట్టు ఐసిస్ వెల్లడించింది.


