
న్యూఢిల్లీ : సమకాలీన ప్రపంచంలో చాలా మందిని వేధిస్తున్న వాటిలో బట్టతల కూడా ఒకటి. పలురకాల సంస్థలు బట్టతల సమస్యను పూర్తిగా తగ్గిస్తామని పేర్కొంటున్నాయి. దీంతో చాలామంది పురుషులు వాటివైపు ఆకర్షితులు అవుతున్నారు. అయితే, తాజా అధ్యాయనంలో బట్టతలకు పరిష్కారం దొరికింది. ఎముకలు పెళుసుబారడాన్ని నివారించే మందుకు బట్టతలను కూడా నివారించే శక్తి ఉందని పరిశోధకుల అధ్యాయనాల్లో తేలింది.
బట్టతల సమస్యతో బాధపడుతూ ఈ మందును వినియోగించిన పురుషులకు కేవలం ఆరు రోజుల్లో రెండు మిల్లీమీటర్ల పాటు జుట్టు పెరిగినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, దీనిపై పూర్తి స్థాయిలో అధ్యాయనం చేయాల్సివుందని చెప్పారు. డబ్ల్యూఏవై-316606 అనే మందును ఉపయోగించినప్పుడు ఈ ఫలితం వచ్చిందని వెల్లడించారు.
కాగా, ప్రస్తుతం బట్టతల నివారణకు రెండు రకాల డ్రగ్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటి వల్ల దుష్ఫలితాలు కూడా ఉంటుండటంతో ఎక్కువ మంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటున్నారు.