
ఇకపై సూపర్ స్పెషాలిటీ వైద్యమైతేనే కార్పొరేట్‌కు రిఫర్
సీఎండీ బలరాం మౌఖిక ఆదేశాలు
రిఫర్ కేసులకు మూడేళ్లలో రూ.30 కోట్లు.. ఆర్నెల్లలో రూ.వంద కోట్లా?
వైద్యాధికారులపై సీఎండీ ఆగ్రహం
గోదావరిఖని: చిన్న వ్యాధులకు ఇక సింగరేణి ఆస్పత్రుల్లోనే వైద్య చికిత్సలు అందించనున్నారు. సంస్థవ్యాప్తంగా ఉన్న ఏడు ఏరియా ఆస్పత్రులను స్పెషాలిటీస్‌గా తీర్చిదిద్దిన క్రమంలో.. సూపర్‌స్పెషాలిటీ వైద్యమైతేనే రిఫర్ చేయాలని సీఎండీ ఎన్.బలరాం ఆదేశించారు. ఆ దిశగా వైద్య యంత్రాంగం ప్రణాళిక రూపొందిస్తోంది. చిన్న చికిత్సలకు ఇక రిఫర్ చేయాలంటే కుదరదని సీఎండీ స్పష్టం చేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడా.. రిఫరల్ వైద్యం కోసం రూ.కోట్లు వెచ్చించడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
ఈమేరకు సీఎండీ బుధవారం వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వారి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రిఫర్ చేసే వైద్యం కోసం మూడేళ్లలో రూ.30 కోట్లు వెచ్చిస్తే, గత ఆర్నెల్లలో రూ.వంద కోట్లు ఖర్చు చేయడమేమిటని మండిపడ్డారని, ఈ క్రమంలో రిఫర్‌పై విధివిధానాలు మారబోతున్నాయని వెల్లడించారు. వైద్య పరీక్షల యంత్రాలు, ఔషధాలు సమకూర్చడానికి యాజమాన్యం సిద్ధంగా ఉన్నా.. కొన్ని ఏరియా ఆస్పత్రుల నుంచి ప్రతిపాదనలు పంపకపోవడం, తనిఖీల సమయంలో చేతులెత్తేయడాన్ని సీఎండీ తీవ్రంగా పరిగణిస్తున్నారు.
వైద్య పరికరాలకు గ్రీన్‌సిగ్నల్
సింగరేణి కార్మిక కుటుంబాలకు వైద్యం అందించేందుకు.. కనీస వైద్య పరికరాలు, మందుల కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని సీఎండీ ఆదేశించారు. తనిఖీల సమయంలో.. ఏ ఒక్క పరికరం అందుబాటులో లేదనే మాట వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వార్షిక ప్రణాళిక కోసం ఎదురు చూడకుండా.. ఎప్పటికప్పుడు అవసరమైన పరికరాల కోసం ప్రతిపాదనలు పంపించాలన్నారు. ఏరియా ఆస్పత్రులకు వైద్యుల్ని కేటాయించామని, ఇంకా అవసరమైన వైద్యుల్ని, టెక్నీషియన్లను నియమించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
వైద్యులు సమర్థతను నిరూపించుకోవాలి
కార్మిక కుటుంబాలకు ఏరియా ఆస్పత్రుల్లో వైద్యం అందించే అవకాశం ఉన్నా వెంటనే హైదరాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని సీఎండీ పేర్కొన్నారు. తద్వారా మూడేళ్లలో రూ.30 కోట్ల వరకు ఉన్న రిఫర్ బిల్లులు.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ డాక్టర్లు తమ సమర్థతను, నైపుణ్యాన్ని చూపించకుండా ప్రతీచిన్న కేసును రిఫర్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
డాక్టర్లు అంకితభావంతో సేవలు అందించాలని, విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలన్నారు. ఏటా సింగరేణి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.400 కోట్లు వెచ్చిస్తోందన్నారు. హైదరాబాద్‌లోనూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.
కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్న క్రమంలో.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సీఎండీ బలరాం సూచించారు. వైరస్ వ్యాప్తి జరిగితే ఎదుర్కొనేందుకు అన్ని ఏరియా ఆస్పత్రుల్లో తగిన విధంగా సంసిద్ధమై ఉండాలని, ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.
కార్పొరేట్‌కు దీటైన వైద్యం
సింగరేణిలో వైద్యులు ఉన్నారు. పరికరాలు, సదుపాయాలు కల్పించాం. ఏడు ఏరియా ఆస్పత్రులు, 21 డిస్పెన్సరీలు ఉన్నాయి. సుమారు 170 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. కార్పొరేట్ ఆస్పత్రితో సమానంగా స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉంది. చిన్న వైద్య సేవలు ఇక్కడే పొందాలి. దీన్ని గమనించి సింగరేణి వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలి.
వైద్యంలో రాజీ లేకుండా ముందుకు వెళ్తున్నాం.ఏటా రూ.400 కోట్లు వైద్యం కోసం వెచ్చిస్తున్నాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండి కూడా చిన్న వైద్యానికి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు రిఫర్ చేయడం సరికాదు. ఉద్యోగుల్లో వైద్యులు నమ్మకాన్ని పెంచుకోవాలి. సంస్థపై ఆర్థిక భారం పడకుండా చూడాలి. – కిరణ్‌రాజ్ కుమార్, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్, సింగరేణి