ముగ్గురికి జన్మించిన బిడ్డ! | Sakshi
Sakshi News home page

ముగ్గురికి జన్మించిన బిడ్డ!

Published Thu, Sep 29 2016 1:12 AM

ముగ్గురికి జన్మించిన బిడ్డ! - Sakshi

న్యూయార్క్: ప్రపంచంలోనే తొలిసారిగా ముగ్గురి ద్వారా ఓ బాబు జన్మించాడు. వివాదాస్పద సరికొత్త సంతానోత్పత్తి విధానంతో ముగ్గురి నుంచి సేకరించిన డీఎన్‌ఏ ద్వారా జోర్డాన్  జంటకు జన్మించాడు. బాబు తల్లి లీగ్ సిండ్రోమ్ అనే జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతోంది. దీంతో పుట్టే పిల్లలకు మెదడు, కండరాలు, నాడీ కణాల అభివృద్ధి లోపం ఏర్పడి చనిపోతారు. వారికి పెళ్లయిన పదేళ్ల తర్వాత బిడ్డ పుట్టినా లీగ్ సిండ్రోమ్ ఉండటంతో ఆరేళ్లకు చనిపోయింది.

రెండోసారి ఓ బాబు పుట్టినా 8 నెలలకే మరణించాడు. దీంతో ఈ జంట న్యూయార్క్‌కు చెందిన ‘న్యూ హోప్’ ఫెర్టిలిటీ సెంటర్‌లోని జాన్ జాంగ్‌ను సంప్రదించారు.  తల్లి అండం నుంచి కేంద్రకాన్ని తీసుకుని దాత అండంలోకి ప్రవేశపెట్టారు. ఈ అండాన్ని తండ్రి శుక్రకణాలతో ఫలదీకరణం చెందించారు. పిండాన్ని తల్లి అండాశయంలోకి చొప్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 6న జన్మించిన బాబు ఆరోగ్యంగా ఉన్నాడు.

Advertisement
Advertisement