చేయిచేయి కలపాలి:ఒబామా పిలుపు

వైట్‌హౌస్‌లో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న ఒబామా


 వాషింగ్టన్: తాము ఇస్లాంతో యుద్ధం చేయడం లేదని, ఆ మతాన్ని వక్రమార్గం పట్టించి హింసకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులపైనే పోరాడుతున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఓడించేందుకు పాశ్చాత్య దేశాలు, ముస్లిం మత పెద్దలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ముస్లిం మతానికి తామే ప్రతినిధులమంటున్న ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు చేయిచేయి కలపాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద గ్రూపుల రిక్రూట్‌మెంట్లను అడ్డుకోవడంపై దష్టి సారించాలన్నారు.  హింసాత్మక తీవ్రవాదానికి వ్యతిరేకంగా వైట్‌హౌస్‌లో జరిగిన ఓ సదస్సులో ఒబామా మాట్లాడారు. దారి తప్పిన సిద్ధాంతాలను వంద కోట్ల మంది ముస్లింలు తిరస్కరిస్తున్నారన్న సంగతిని అల్‌కాయిదా, ఐఎస్ ఉగ్రవాద సంస్థలు గుర్తించడం లేదని పేర్కొన్నారు.



‘‘అల్‌కాయిదా, ఐఎస్‌ఐఎల్ వంటి ఉగ్రవాద సంస్థలు ఇస్లాంను అడ్డుపెట్టుకొని తమను తాము మత ప్రతినిధులుగా, పవిత్ర యుద్ధం చేస్తున్నవారిగా ప్రకటించుకుంటున్నాయి. ఐఎస్ సంస్థ తనను తాను ఇస్లామిక్ స్టేట్‌గా చెప్పుకుంటోంది. అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇస్లాంతో యుద్ధం చేస్తున్నాయని త ప్పుడు ప్రచారం చేస్తోంది. దీన్ని చూపే యువతకు గాలం వేస్తూ తమ సంస్థల్లో చేర్చుకుంటోంది. వారు ఉగ్రవాదులే తప్ప ఎంతమాత్రం మతానికి ప్రతినిధులు కాబోరు. దేవుడి పేరుతో అమాయకులను చంపేవారు పిచ్చివారే అవుతారు. ఉగ్రవాదానికి ఏ మతంతోనూ సంబంధం లేదు. ముస్లిం, క్రై స్తవం, బుద్దిజం, హిందూయిజం, జుడాయిజం పేరుతో పాల్పడే హింసను ఏ మతం కూడా అంగీకరించదు. పాశ్చాత్య దేశాలు ముస్లింకు వ్యతిరేకం అన్న తప్పుడు భావనను ప్రపంచ దేశాలు, ముస్లిం సమాజం తిరస్కరించాలి’’ అని ఒబామా అన్నారు.



అమాయకులపై ఎలాంటి హింసకైనా ఇస్లాం వ్యతిరేకమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గట్టిగా చెప్పాలని కోరారు. అల్‌కాయిదా, ఐఎస్ ఉగ్రవాద సంస్థలు ప్రపంచానికి సవాలు విసురుతున్నాయని, అత్యంత క్రూరంగా అమాయకుల తలలు నరికేస్తున్నారని, అమానవీయ చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. ఈ సదస్సులో భారత్‌తోపాటు 60 దేశాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top