భూకంపాలను గుర్తించే జంతువులు | animals can smell earthquakes well before, say studies | Sakshi
Sakshi News home page

భూకంపాలను గుర్తించే జంతువులు

Apr 1 2015 7:33 PM | Updated on Sep 2 2017 11:42 PM

భూకంపం రావడానికి ముందు పశుపక్ష్యాదుల ప్రవర్తనలో తేడాలొస్తాయని, కొన్ని రోజుల ముందే వాటి ప్రవర్తనలో తేడాలొస్తాయని బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాచెల్ గ్రాంట్ కనుగొన్నారు.

భూకంపం రావడానికి ముందు పశుపక్ష్యాదుల ప్రవర్తనలో తేడాలొస్తాయని మన పెద్దలు చెబుతారు. ఇంతకాలం దీనికి శాస్త్రీయమైన ఆధారాలేవీ దొరకలేదు. ఇప్పుడు దొరికాయి. కొన్ని క్షణాలో, గంటల ముందోకాదు.. కొన్ని రోజుల ముందే వాటి ప్రవర్తనలో తేడాలొస్తాయని బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాచెల్ గ్రాంట్ కనుగొన్నారు. పెరూలోని యనచాగ జాతీయ పార్క్‌లో ఏర్పాటుచేసిన కెమెరాలను విశ్లేషించడం ద్వారా ఆయన ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆ ప్రాంతంలోని కాంటమానాలో 2011లో రెక్టర్ స్కేల్‌పై 7 పాయింట్ల తీవ్రతతో పెను భూకంపం వచ్చింది. ఆ కాలానికి సంబంధించి జాతీయ పార్కులోని కెమెరాలు తీసిన దృశ్యాలను డాక్టర్ రాచెల్ గ్రాంట్ లోతుగా అధ్యయనం చేశారు.

పెను భూకంపానికి 23 రోజుల ముందు నుంచే జంతువుల ప్రవర్తనలో వచ్చిన మార్పులను ఆయన గ్రహించారు. 15 రోజుల ముందు వాటిలో కలకలం రేగింది. సరిగ్గా ఆ భూకంపానికి ఐదు రోజుల ముందు అవి ఎలాంటి కదలికలు లేకుండా స్తబ్దుగా ఉండిపోయాయి. అంటే అప్పటికే ఓ ప్రళయం రాబోతుందన్న స్పృహ వాటికి కలిగిందన్నమాట. భూకంపానికి ముందు, భూ పొరల్లో, ముఖ్యంగా రాళ్ల దిగువన ఏర్పడిన కదలికల వల్ల భూ ఉపరితలంపై, భూవాతావరణంలోని గాలిలో అయాన్ల చలనం ఏర్పడుతుంది. 15 రోజుల ముందు నుంచే అయాన్ల చలనం ప్రారంభమవుతుంది. దీనివల్ల జంతువులపై సెరొటోనియం సిండ్రోమ్ ప్రభావం కలుగుతుంది. అంటే రక్త ప్రసారంలో సెరొటోన్ల స్థాయి హఠాత్తుగా పెరుగుతుంది. అది పెరగడం వల్ల జంతువుల శరీరంలో అలసట, గుండెలో తెలియని గుబులు, అర్థంకాని మానసికాందోళన కలుగుతాయి. అందువల్ల జంతువుల ప్రవర్తనలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి. బొరియల్లో నివసించే జంతువులు, క్షీరదాలు, పక్షుల్లోనే ఈ మార్పులు ఎక్కువగా సంభవిస్తాయని, వాటి ప్రవర్తనను గమనించడం ద్వారా భూకంపం తీవ్రతను గుర్తించవచ్చని రాచెల్ వివరించారు. పెను భూకంపాలను ఇక ముందు వారం, పది రోజుల ముందుగానే నిపుణులు గుర్తించేందుకు రాచెల్ అధ్యయనం ఎంతగానో దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement