ఆ ఎనిమిది మంది డిటెన్షన్‌పై విచారణ 

American Telangana Association Legal Aid Detention Students In Us Fake University Case - Sakshi

మిచిగాన్‌ ఫెడరల్‌ న్యాయస్థానంలో ప్రారంభం

న్యాయసాయం అందిస్తున్న అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌

8 మంది ట్రయల్‌ పూర్తయ్యాకే 156 మందిపై విచారణ..  

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీ కేసులో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్న 8 మంది మధ్యవర్తుల విచారణ ప్రారంభమైంది. అమెరికా కాలమానం ప్రకారం మిచిగాన్‌ ఫెడరల్‌ న్యాయస్థానంలో సోమవారం విచారణ మొదలైంది. యూఎస్‌ పోలీసుల అదుపులో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థుల తరఫున వాదనలు వినిపించేందుకు గాను అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన అటార్నీ ఎడ్వర్డ్‌ బజూకా తొలిరోజు వాదనలు వినిపించారు. విచారణ పూర్తయ్యేంతవరకు ఆ ఎనిమిది మందిని ఫెడరల్‌ కస్టడీలోనే ఉంచాలని, వారు బెయిల్‌పై బయటకు వస్తే యూఎస్‌ ఐసీఈ (స్టేట్స్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌) అధికారులు వారిని అరెస్టు చేసే అవకాశముందని బజూకా కోర్టుకు విన్నవించారు.

యూఎస్‌ ఐసీఈ కస్టడీలో ఉంటే అది శిక్షగా పరిగణనలోకి తీసుకోరని, ఫెడరల్‌ కస్టడీలో ఉంటేనే శిక్షాకాలం కింద పరిగణనలోకి తీసుకుంటారని, ఈ కారణంతోనే అలా కోర్టుకు విన్నవించారని సమాచారం. అటార్నీ విన్నపాన్ని కోర్టు సానుకూలంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో అరెస్టయిన ఈ3 (డిఫెండెంట్‌) ఫణీంద్ర కర్ణాటికి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. కానీ అతను ఏ1 వీసా కలిగి ఉండటంతో యూఎస్‌ ఐసీఈ అదుపులోకి తీసుకోలేదని తెలుగు అసోసియేషన్లు వెల్లడించాయి. గతంలో ఈ కేసులో 156 మంది విద్యార్థులను అరెస్టు చేసిన సమయంలో సేకరించిన ఫైళ్లు, ఫోన్‌ కాల్‌ డేటా వివరాలను కూడా పరిశీలించేందుకు కోర్టుకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణలో చాలా విశ్వసనీయ విషయాలు వెల్లడవుతున్నాయని తెలుస్తోంది. తదుపరి విచారణ ఎప్పుడనేది కూడా న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఉంటుందని, అది వచ్చే వారం ఉండే అవకాశముం దని సమాచారం. కాగా, ఈ ఎనిమిది మంది మధ్యవర్తుల ట్రయల్‌ పూర్తయిన తర్వాతే అరెస్టయిన 156 మంది విషయంలో కోర్టు విచారణ చేపట్టనుంది.  

త్వరగా విడుదలయ్యేలా కృషి.. 
‘డిటెన్షన్‌ సెంటర్‌లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం చేస్తున్నాం. మా సంస్థ తరపున ఎడ్వర్డ్‌ బజూకా నేతృత్వంలోని బృందాన్ని అటార్నీగా నియమించాం. మిచిగాన్‌ ఫెడరల్‌ న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. ఫణీంద్రకు బెయిల్‌ రావడం శుభసూచకం. వచ్చే వారం సెకండ్‌ ట్రయల్‌ ఉంటుంది. ఫణీంద్ర తరహాలోనే సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు విద్యార్థులకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు మా సంస్థ తరఫున అందిస్తాం..’ –వెంకట్‌ మంతెన, అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌ ప్రతినిధి
 
అది తప్పని వారికి తెలుసు
వాషింగ్టన్‌: నకిలీ యూనివర్సిటీలో పేరు నమోదుచేసుకుని దొరికిపోయిన 130 మంది విద్యార్థులకు తాము చేసింది తప్పని తెలుసని అమెరికా హోం శాఖ పేర్కొంది. ఎలాగైనా అమెరికాలో నివసించాలనే వారు ఈ అక్రమానికి పాల్పడ్డారని తెలిపింది. ఫార్మింగ్టన్‌ వర్సిటీ కార్యకలాపాలపై విద్యార్థులకు ఎలాంటి అవగాహన లేదని, అందుకే వారు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా హోం శాఖ ప్రకటన భిన్నంగా రావడం గమనార్హం. ‘ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీలో తరగతులు, ఉపాధ్యాయులు లేరన్న సంగతి ఆ విద్యార్థులకు తెలుసు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండేందుకు అక్రమాలకు పాల్పడుతున్న సంగతి వారికి తెలుసు’హోం శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఫార్మింగ్టన్‌ వర్సిటీ బాధితుల్లో ఎక్కువ మంది తెలుగువారు ఉండటం పట్ల నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాటా) విచారం వ్యక్తం చేసింది. 

117 మందికి సాయం..
ఫార్మింగ్టన్‌ వర్సిటీ కేసులో అరెస్టయిన 129 మంది భారత విద్యార్థుల్లో 117 మందికి దౌత్య, న్యాయపర సాయం చేసేందుకు అనుమతి లభించిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. విద్యార్థుల నిర్బంధం పై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అమెరికా వ్యాప్తంగా 36 జైళ్లను సందర్శించి 117 మంది విద్యార్థులకు దౌత్యసాయం చేసేందుకు అనుమతులు సంపాదించామని, మిగిలిన 12 మంది కూడా సాయం చేసేందుకు ప్రయత్నాలు కొన సాగుతున్నాయని చెప్పింది.  
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top