
జెనీవా: ఆగస్టు 25 నుంచి ఇప్పటివరకు 5,82,000 మంది రోహింగ్యా శరణార్థులు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు వలసవచ్చినట్లు ఐక్యరాజ్యసమితి మంగళవారం వెల్లడించింది. వీరిలో ఈ వారాంతంలో 45 వేల మంది వచ్చారని తెలిపింది. ఇంకా కొన్ని వేల మంది రోహింగ్యాలు ఆశ్రయం కోసం సరిహద్దు ప్రాంతాల వద్ద వేచి చూస్తున్నారని పేర్కొంది.
వీరిలో పలువురి జాడ తెలియరాలేదని వెల్లడించింది. వలస వెళ్లి గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం కంటే వారి ఇళ్లలో ఉండేందుకే రోహింగ్యాలు మొగ్గు చూపుతున్నారని, చివరికి భద్రతా దళాల దాడులకు బలవుతున్నారని ఐరాస శరణార్థుల ఏజెన్సీ ప్రతినిధి ఆండ్రూజ్ మెహెసిక్ తెలిపారు. దుర్భల పరిస్థితుల మధ్య వారు కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు.