అట్టుడికిన ఉస్మానియా యూనివర్సిటీ | young man body in water tank on Osmania University | Sakshi
Sakshi News home page

అట్టుడికిన ఉస్మానియా యూనివర్సిటీ

Mar 24 2016 5:26 AM | Updated on Aug 1 2018 2:31 PM

అట్టుడికిన ఉస్మానియా యూనివర్సిటీ - Sakshi

అట్టుడికిన ఉస్మానియా యూనివర్సిటీ

ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని వాటర్ ట్యాంక్‌లో బుధవారం ఓ యువకుని మృతదేహం కనిపించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

వాటర్ ట్యాంక్‌లో యువకుని మృతదేహం.. ఉద్రిక్తం
నిరుద్యోగ విద్యార్థిగా భావించి పోలీసులపై విద్యార్థుల రాళ్ల వర్షం
లాఠీచార్జీ.. పరస్పర దాడుల్లో డీసీపీ సహా పలువురికి గాయాలు
పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల అరెస్ట్
మృతదేహం మాణికేశ్వర్ నగర్‌కు చెందిన వ్యక్తిదిగా గుర్తింపు 

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని వాటర్ ట్యాంక్‌లో బుధవారం ఓ యువకుని మృతదేహం కనిపించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వాటర్ ట్యాంక్‌లో మూడు రోజులుగా శవం ఉండడం.. ఆ మృతదేహం ఎవరిదనే విషయంలో పోలీసులకు, విద్యార్థులకు తొలుత స్పష్టత లేకపోవడంతో ఓయూ క్యాంపస్ అట్టుడికింది. ఆ మృతదేహం ఓయూ విద్యార్థిదైతే పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన పోలీసులు గుట్టుచప్పు డు కాకుండా శవాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. ట్యాంకర్‌లో శవం విషయం క్షణా ల్లో అంతటా వ్యాపించడంతో వందలాది మంది విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ క్యాంపస్‌కు చేరుకున్నారు.

యూనివర్సిటీ లైబ్రరీ వెనుక గల ట్యాంకర్‌లో శవం కనిపించడంతో అది పోటీ పరీక్షల కోసం అక్కడికి చదువుకోవడానికి వచ్చే నిరుద్యోగ విద్యార్థిదై ఉండవచ్చని విద్యార్థి నాయకులు భావించారు. ఉద్యోగాల భర్తీలో జాప్యం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ.. శవాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ప్రతిగా పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. పరస్పర దాడుల్లో ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు గాయపడ్డారు. చివరికి వాటర్ ట్యాంక్‌లోని శవం ఓయూ విద్యార్థిది కాదని, క్యాంపస్‌కు ఆనుకుని ఉన్న మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన బత్తుల సలారిబాబు అలియాస్ బాబాది అని తేలడంతో పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆందోళనల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 బాబాదిఆత్మహత్య: సీఐ అశోక్‌రెడ్డి
ఓయూలో ఆత్మహత్య చేసుకుంది విద్యార్థి కాదని, మృతుడు మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన బాబాగా గుర్తించామని సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. సెల్‌ఫోన్ ఆధారంగా అతడిని గుర్తించామని చెప్పారు. మాణికేశ్వర్‌నగర్‌లో నివసించే చౌడమ్మ ముగ్గురు సంతానంలో బాబా చిన్నవాడని తెలిపారు. బాబా ఈ నెల 21న ఇంట్లో నుంచి పరారైనట్లు అతని సోదరుడు నాగరాజు ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, మాణికేశ్వర్‌నగర్‌లో బాబా కుటుంబం గురించి ఆరా తీసేందుకు వెళ్లిన విద్యార్థులపై స్థానికులు దాడి చేయగా.. మోహన్ అనే పీహెచ్‌డీ విద్యార్థి గాయపడ్డాడని, మాణికేశ్వర్‌నగర్‌లో అద్దెకు ఉంటున్న పలువురు విద్యార్థులపైనా దాడులు జరిగాయని విద్యార్థి జేఏసీ నేత మానవత రాయ్ వెల్లడించారు.

విద్యార్థుల భయాందోళన
వాటర్ ట్యాంక్‌లో మూడు రోజులుగా శవం ఉండడంపై విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. తాగునీరు కలుషితమై ఆరోగ్యం పాడవుతుందని భయపడుతున్నారు. వాటర్ ట్యాంక్ వద్ద సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని, యువకుడు ఆత్మహత్య చేసుకున్నందున వెంటనే ట్యాంక్ శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు.

లాఠీచార్జీకి నిరసనగా నేడు వర్సిటీల బంద్
విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా నేడు తెలంగాణ యూనివర్సిటీల బంద్ పాటించనున్నట్లు ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ మానవతరాయ్, నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఆంజనేయులు, అధ్యక్షుడు టీకే శివప్రసాద్ ప్రకటించారు. యువకుని మృతిపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని, బాధితుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, ఒకరికి ఉద్యోగమివ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎదర్కొం టున్న సమస్యలు, వీసీల నియామకం కోసం గురువారం నిరుద్యోగ విద్యార్థుల ప్రదర్శనను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement