ప్రేమ విఫలమైందని ఒంటికి నిప్పంటించుకున్న విద్యార్థి | Tragedy Incident in Mahabubabad District | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమైందని ఒంటికి నిప్పంటించుకున్న విద్యార్థి

Apr 28 2026 12:44 AM | Updated on Apr 28 2026 12:44 AM

Tragedy Incident in Mahabubabad District

ఓయూ క్యాంపస్‌లో ఘటన.. 

70 శాతం కాలిన గాయాలతో పరిస్థితి విషమం

లాలాపేట: ప్రేమలో విఫలమయ్యానన్న బాధతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఓయూ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌బాబాద్‌ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం తండాకు చెందిన బోడ వినీష్‌కుమార్‌ (19) ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీఈ (మైనింగ్‌ ఇంజనీరింగ్‌) ఫస్టియర్‌ చదువుతున్నాడు. ఓయూ క్యాంపస్‌లోని హాస్టల్‌లో ఉంటున్నాడు.

సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో క్యాంపస్‌లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన ఉమెన్స్‌ హాస్టల్‌ గార్డు స్థానికులను అప్రమత్తం చేయగా వారు మంటలు ఆర్పి వినీష్‌కుమార్‌ను 108 అంబులెన్స్‌ ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనాస్థలిలో లభించిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా వినీష్‌కుమార్‌ తన క్లాస్‌మేట్‌తో ప్రేమ విఫలమై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తేల్చారు. ప్రస్తుతం 70 శాతం కాలిన గాయాలతో వినీష్‌కుమార్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కాగా, వినీష్‌కుమార్‌ 3 నెలల నుంచి కాలేజీకి రావట్లేదని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement