
కాంగ్రెస్‌లోనే దానం
టీఆర్‌ఎస్‌లో చేరిక కోసం ఏర్పాట్లు.. కేసీఆర్ రాలేననడంతో కినుక.. ఆపై కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ప్రకటన.
- చివరి నిమిషంలో నిర్ణయం మార్పు
- పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి
- షబ్బీర్‌తో భేటీ అనంతరం ప్రకటన
- టీఆర్‌ఎస్‌లో చేరిక కోసం ఏర్పాట్లు.. కేసీఆర్ రాలేననడంతో కినుక!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్‌లోనే కొనసాగనున్నారు. పార్టీ మారబోనని ఆయన స్పష్టంచేశారు. సోమవారం ఉదయం శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి దానం సుదీర్ఘ సమాలోచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలోకి వెళ్లటం లేదని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని తెలిపారు.
కొందరు తనను పార్టీ నుంచి పంపే ప్రయత్నాలు చేశారని, అయినా ప్రస్తుతం అన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించే లక్ష్యంతో పని చేస్తానని చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో డివిజన్ల వారిగా సమీక్షలు నిర్వహిస్తానని, గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ నేతలు మైండ్‌గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల్లో బలం పెంచుకోకుండా ఇతర పార్టీల నుంచి కిరాయికి తెచ్చుకున్న నేతలతో ప్రభుత్వాన్ని నడిపించుకోవాలని టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
సీఎం సమక్షంలో అయితేనే..
సోమవారం మధ్యాహ్నం దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌లో చేరటం లాంఛనమేనని అందరూ భావించారు. అందుకు అనుగుణంగా టీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంది. దానం అనుచరులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బాణసంచాకు ఆర్డర్లు కూడా ఇచ్చారు.
అయితే ఆదివారం మధ్యాహ్నానికే ముఖ్యమంత్రి కేసీఆర్.. దానం చేరిక కార్యక్రమంలో పాల్గొనటం లేదన్న సమాచారం పార్టీ వర్గాలకు అందింది. దానం పార్టీలోకి వచ్చే కార్యక్రమాన్ని నగర మంత్రుల సమక్షంలో నిర్వహించాలని సూచించారు. అయితే దానం మాత్రం సీఎం సమక్షంలో అయితేనే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతానని, లేనట్లయితే అవసరం లేదని తేల్చేసి సోమవారం ఉదయమే షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లారు. అనంతరం కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
అధ్యక్షుడిగా కొనసాగుతారా?
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దానం నాగేందర్‌ను కొనసాగించే విషయంలో పునరాలోచన చేయాలని పలువురు నగర పార్టీ నేతలు పీసీసీ, ఏఐసీసీకి విజ్ఞప్తి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. నగరంలో మంచి క్యాడర్ ఉన్న నాగేందర్ పార్టీలో పనిచేసేందుకు తిరిగి రావటం సంతోషమే అయినా.. ఆయన్ను యథాతథంగా నగర అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగిస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయో ఆలోచించాలని వారు పార్టీ అగ్రనేతలకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఈ విషయమై పీసీసీ ముఖ్య నేత ఒకరిని ప్రశ్నించగా.. ఇప్పుడే ఏం చెప్పలేనని వ్యాఖ్యానించారు.