కి'లేడీ' అరెస్ట్ | Sakshi
Sakshi News home page

కి'లేడీ' అరెస్ట్

Published Tue, May 17 2016 9:44 AM

కి'లేడీ' అరెస్ట్

 పోలీసుల అదుపులో సహకరించిన మరో మహిళ
 రూ.7.75 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం
 100 కేసుల్లో నేరస్తురాలిగా ఉన్న లక్ష్మి

 
 మేడ్చల్: తాళం వేసిన ఇళ్లల్లో పగటిపూట దొంగతనాలకు పాల్పడుతూ.. 100 నేరాలతో సంబంధం ఉన్న పాత నేరస్తురాలిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించిన మరో మహిళతోపాటు రూ.7 లక్షల 75 వేల విలువ చేసే 24.8 తులాల బంగారం, 72.8 తులాల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, సైబరాబాద్ నేర విభాగం ఏసీపీ ఉషారాణి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటకు చెందిన గడ్డం లక్ష్మి అలియాస్ చెంచులక్ష్మి అలియాస్ గుండ్లపోచమ్మ(34) తన 14వ ఏట నుంచే దొంగతనాలు చేయడం మొదలుపెట్టింది.
 
  ప్రతిరోజూ కూలీ పనిచేస్తున్నట్లు నమ్మిస్తూ.. తాళం వేసిన ఇళ్లల్లో పగటిపూట దొంగతనాలకు పాల్పడుతూ.. దొంగిలించిన సొమ్మును తన వదిన అయిన మంగమ్మ వద్ద దాచిపెట్టేది. అయితే నిరుడు జూలై నెలలో మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మేడ్చల్ పట్టణంలోని ఉమానగర్, వినాయక్‌నగర్, వెంకటరామయ్య కాలనీల్లో తాళం వేసి ఉన్న పలు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. దీంతో నిందితులను పట్టుకునేందుకు పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, బాలానగర్ నేరవిభాగం ఏసీపీ ఉషారాణి, సైబరాబాద్ సీసీఎస్ (క్రైమ్ కంట్రోల్ స్టేషన్) సీఐ సైదులు, మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి సంయుక్తంగా దర్యాప్తు జరపగా.. పాత నేరస్తురాలైన చెంచులక్ష్మి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తేలింది. దీంతో సోమవారం ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ రైల్వేస్టేషన్ సమీపంలో చెంచులక్ష్మి, మంగమ్మలను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో పోలీసులు విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
 100 కేసుల్లో లక్ష్మి నిందితురాలు..
 మేడ్చల్, కేపీహెచ్‌బీ, దుండిగల్, శామీర్‌పేట్, జీడిమెట్ల, పేట్‌బషీరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా అయిజ, కర్నూలు జిల్లా చెగలమర్రి పోలీస్‌స్టేషన్ల పరిధిలో లక్ష్మి గత జులై నుంచి 11 దొంగతనాలకు పాల్పడింది. గతంలో ఆమెపై హైదరాబాద్ కమి షనరేట్ పరిధిలోని ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, నల్లకుంట, లంగర్‌హౌజ్, వులక్‌పేట్, కుల్సుంపుర, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, సైబరాబాద్ పరిధిలోని చందానగర్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, శంషాబాద్, నార్సింగి, సనత్‌నగర్, మెదక్ జిల్లా రామచంద్రాపురం, మహబూబ్‌నగర్ జిల్లా అమ్మిగనూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో దాదాపు 100 నేరాలకు పాల్పడి పలుమార్లు జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చింది. ప్రస్తుతం శంషాబాద్, రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆమెపై నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. లక్ష్మిపై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement