అసలేం జరుగుతోంది? | What happening actually? | Sakshi
Sakshi News home page

అసలేం జరుగుతోంది?

Jul 2 2016 3:10 AM | Updated on Aug 31 2018 8:31 PM

అసలేం జరుగుతోంది? - Sakshi

అసలేం జరుగుతోంది?

అత్యంత వివాదాస్పదంగా మారిన న్యాయాధికారుల కేటాయింపుల ప్రాథమిక జాబితా, దానిపై ఆందోళనలు, సస్పెన్షన్లు, ఈ సమస్యకు పరిష్కార మార్గం తదితర అంశాలపై గవర్నర్ నరసింహన్ దృష్టి సారించారు.

- న్యాయాధికారుల ఆందోళనపై ఏసీజే, ఏజీలతో గవర్నర్ సమాలోచనలు
 
 సాక్షి, హైదరాబాద్ : అత్యంత వివాదాస్పదంగా మారిన న్యాయాధికారుల కేటాయింపుల ప్రాథమిక జాబితా, దానిపై ఆందోళనలు, సస్పెన్షన్లు, ఈ సమస్యకు పరిష్కార మార్గం తదితర అంశాలపై గవర్నర్ నరసింహన్ దృష్టి సారించారు. శుక్రవారం ఆయన ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, తెలంగాణ ఏజీ కె.రామకృష్ణారెడ్డితో వేర్వేరుగా సమాలోచనలు జరిపారు. ఏజీతో దాదాపు గంట, ఏసీజేతో గంట న్నర పాటు చర్చించినట్టు తెలిసింది. ఉమ్మడి హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపుల జాబితా ఉపసంహరణ, న్యాయాధికారులపై సస్పెన్షన్ ఎత్తివేత డిమాండ్‌లతో తీవ్ర ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవలే సీఎం కేసీఆర్ సైతం గవర్నర్‌ను కలసి ఈ వ్యవహారంపై చర్చిం చిన విషయం తెలిసిందే.

ఏసీజే, ఏజీలతో భేటీలో ప్రాథమిక కేటాయింపుల జాబితా రూపకల్పన మొదలు.. మహాధర్నా వరకు గవర్నర్ చర్చించినట్లు సమాచారం. న్యాయాధికారుల కేటాయింపులకు సంబంధించిన విధి విధానాలు, నియమ, నిబంధనల గురించి ఏజీతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం కేటాయింపులన్నీ కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని, అయితే ఈ విషయంలో కేంద్రం మొదటి నుంచీ పట్టన్నట్లు వ్యవహరిస్తోంద ని ఏజీ గవర్నర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఓ సీనియర్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కేటాయింపులు జరపడం అందరికీ మంచిదని ఏజీ అభిప్రాయపడినట్లు తెలిసింది. దీని వల్ల తెలంగాణ న్యాయాధికారుల్లో కొంత విశ్వాసం కలుగు తుందన్నారు.

తాను రూపొందించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా హైకోర్టు కేటాయింపుల జాబితా తయారు చేసిందని, దీంతో సమస్య మొదలైందని ఆయన తెలిపి నట్టు సమాచారం. హైకోర్టు విభజన గురించీ వీరి మధ్య చర్చ జరిగింది. తరువాత భేటీ అయిన ఏసీజే.. న్యాయాధికారుల కేటాయింపుల జాబితా తయారీ, సస్పెన్షన్లకు దారి తీసిన పరిస్థితులను గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. న్యాయాధికారుల సస్పెన్షన్‌ను ఈ సందర్భంగా ఏసీజే సమర్థించుకున్నట్లు తెలిసింది. న్యాయవ్యవస్థలో క్రమశిక్షణ ముఖ్యమని, ఈ విషయంలో న్యాయాధికారులు రోడ్డెక్కి గీత దాటారని, అందుకే వారిపై సస్పెన్షన్ వేటు వేశామని పేర్కొన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన గురించి కూడా వీరు చర్చించారు. విభజన విషయంలో హైకోర్టు తీర్పుపై కూడా చర్చ జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement