Sakshi News home page

జల విద్యుత్‌పై ఆశలు...

Published Mon, Oct 3 2016 3:27 AM

జల విద్యుత్‌పై ఆశలు...

సాక్షి, హైదరాబాద్: జల విద్యుదుత్పత్తి ఆశలు రేకెత్తిస్తోంది. భారీ వర్షాలు కురిసి రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు నిండడంతో ఈ ఏడాది పెద్దెత్తున జల విద్యుదుత్పత్తిపై ఆశలు చిగురించాయి. గతేడాది తీవ్ర వర్షాభావం వల్ల జలాశయాలు వెలవెలబోవడంతో నామమాత్రంగా విద్యుదుత్పత్తి జరిగింది. ఈ సారి జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం ఎడమ గట్టు, సింగూరు, నిజాంసాగర్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. గతేడాది 2015-16లో 290 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జల విద్యుదుత్పత్తి మాత్రమే జరగగా.. ఈ ఏడాది 2016-17లో ఇప్పటి వరకు 718 ఎంయూల ఉత్పత్తి జరిగింది. 2014-15లో మాత్రం అత్యధికంగా 3128.69 ఎంయూల జల విద్యుదుత్పత్తి జరిగింది.
 
జల విద్యుత్‌కు ఢోకా లేదు...
జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జున సాగర్, నాగార్జునసాగర్ ఎడమగట్టుతో సహా రాష్ట్రంలో 2321.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. సాగర్ మినహా మిగిలిన ప్రధాన జల విద్యుత్ కేంద్రాల్లో గత కొన్నిరోజులుగా నిరంతర విద్యుదుత్పత్తి జరుగుతోంది. 2015 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్యకాలంలో 63 ఎంయూల ఉత్పత్తి జరిగితే ...సరిగ్గా అదే వ్యవధిలో అంటే, 2016 ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో 701 ఎంయూల ఉత్పత్తి జరిగింది.

ఈ ఏడాది 2016-17లో 3420 ఎంయూల జలవిద్యుదుత్పత్తి జరగవచ్చని డిస్కంలు ఆశపెట్టుకున్నాయి. అయితే, ఇంతకు మించి 3841 ఎంయూల ఉత్పత్తి జరిగే అవకాశముందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) టారీఫ్ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నాగార్జున సాగర్ జలవిద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 1119 ఎంయూలు, శ్రీశైలం ఎడమగట్టు నుంచి 1350 ఎంయూలు, దిగువ జూరాల నుంచి 534 ఎంయూలు, జూరాల నుంచి 109 ఎంయూలు, ఇతరాత్రా జల విద్యుత్ కేంద్రాలు కలుపుకుని మొత్తం 3841 ఎంయూల వార్షిక ఉత్పత్తికి అవకాశముందని స్పష్టం చేసింది.

ఇప్పటికే 718 ఎంయూల ఉత్పత్తి జరిగింది. మరోవైపు జలాశయాల నిండా నిల్వలు ఉండడంతో వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోపు ఈఆర్సీ అంచనాలకు మించి విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయి. 2016-17లో రాష్ట్ర విద్యుత్ అవసరాలు   52,063 ఎంయూలు కాగా అందులో జల విద్యుత్ వాటా 3841 ఎంయూలు కావడం విశేషం.

Advertisement

What’s your opinion

Advertisement