కమ్యూనిస్టు యోధుడు ఉజ్జిని ఇకలేరు


హైదరాబాద్: తొలితరం కమ్యూనిస్టు యోధుడు, నల్లగొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని నారాయణరావు(90) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని సైదాబాద్‌లోని తన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు నివాసానికి తరలించారు.

 

 మాజీ మంత్రి జానారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు ఉజ్జిని భౌతికకాయాన్ని సందిర్శించి నివాళులు అర్పించారు. అనంతరం భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారం గ్రామానికి తరలించారు. అక్కడ నల్లగొండ జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణరావు మూడుసార్లు మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన నాయకుడిగా పేరు గడించారు.  నారాయణరావు మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. కమ్యూనిస్టు సీనియర్ నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా పేదల పక్షాన అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు.

 

 సీపీఐ సంతాపం: ఉజ్జిని నారాయణరావు   మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. సైదాబాద్‌లోని ఆయన నివాసంలో నారాయణరావు భౌతికకాయంపై పుష్పగుచ్ఛాలుంచి చాడ, ఇతర నేతలు పల్లా వెంకటరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్ తదితరులు నివాళులర్పించారు.

 

 నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి ఇతర నేతలతో కలసి ఎంతో కృషి చేశారని తమ కుటుంబ సభ్యులను పార్టీ సభ్యులుగా, నాయకులుగా ఆయన తీర్చిదిద్దారని సురవరం సంతాప సందేశంలో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పొల్కంపల్లి వెంకటరామారావుతో కలసి ఆంధ్ర మహాసభలో చేరి ప్రజాసమస్యలపై స్పందించి కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగారని, భూ పోరాట ఉద్యమాల్లో పాల్గొన్నారని చాడ వెంకటరెడ్డి అన్నారు.

 

 ప్రజా ఉద్యమానికి అంకితం

 కమ్యూనిస్టు ఉద్యమం తీవ్ర నిర్బంధానికి గురైన కాలంలో కూడా నారాయణరావు ప్రజా ఉద్యమానికి అంకితమై పనిచేశారని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన మృతికి నివాళులర్పించారు. ఉన్నత కుటుంబంలో పుట్టినా పేద రైతాంగం పట్ల నిబద్ధతతో కృషి చేశారని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top