ట్రా‘వెల్’ బిజినెస్! | Sakshi
Sakshi News home page

ట్రా‘వెల్’ బిజినెస్!

Published Fri, Jan 29 2016 1:25 AM

ట్రా‘వెల్’ బిజినెస్!

* ప్రచారంలో రోజుకు వేల సంఖ్యలో అద్దె వాహనాలు
* గత వారం రోజులుగా భారీగా పెరిగిన వినియోగం

సాక్షి, సిటీబ్యూరో: ఇంటిల్లిపాదీ కలసి ఇన్నోవా, టవేరా వంటి వాహనాలను అద్దెకు తీసుకొని తిరుమలేశుని దర్శనానికో... బంధువుల ఇళ్లకో వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మరో వారం రోజులు ఓపిక పట్టాల్సిందే. అవును... ప్రస్తుతం నగరంలోని అద్దె వాహనాలన్నీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులకు వాహనాలు సమకూర్చడంలో ట్రావెల్స్ కంపెనీలు బిజీబిజీగా ఉన్నాయి. గత వారం రోజులుగా నగరంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచార రథాలు, అభ్యర్థుల పర్యటనలకు వాహనాల వినియోగం భారీగా పెరిగింది.

ఇండికా వంటి చిన్నవి మొదలుకొని.. క్వాలిస్, స్విఫ్ట్‌డిజైర్, ఫార్చునర్, ఎర్టిగా, గ్జైలో తదితర వాహనాల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ట్రావె ల్స్ కంపెనీల వద్ద బారులు తీరుతున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో ట్రావెల్స్ కంపెనీలు సైతం బాగానే డిమాండ్ చేస్తున్నాయి. వాహనం సామర్థ్యాన్ని బట్టి రోజుకు రూ.2000 నుంచి రూ.5000 వరకు వసూలు చేస్తున్నాయి. చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి సుమారు 100కు పైగా ట్రావెల్స్ కంపెనీలకు ఎన్నికల కాలం బాగా కలసి వస్తోంది. నగరంలో ప్రస్తుతం 1,333 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.

వీరు నిత్యం 10 వేల వరకు వాహనాలను వినియోగిస్తున్నట్లు అంచనా. ఈ వాహనాలపై రోజుకు  రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారానికి నాయకులు, కార్యకర్తలను బస్తీలకు, కాలనీలకు తరలించడంలోనూ, ముఖ్యమైన నాయకుల రోడ్‌షోలకు వాహనాల వినియోగం తప్పనిసరి కావడంతో చాలా మంది అభ్యర్థులు సగటున 5 నుంచి 10 వాహనాలు అద్దెకు తీసుకుంటున్నారు. నగరంలోని ట్రావెల్స్‌కు డిమాండ్ ఉండడంతో వరంగల్, నల్లగొండ, మెదక్, ఖమ్మం తదితర జిల్లాల నుంచీ వాహనాలను తీసుకొస్తున్నారు.
 
ఆటోలకూ గిరాకీ...
చిన్న చిన్న బస్తీలు, కాలనీలు, శివారు ప్రాంతాల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి ఆటోలను వినియోగిస్తున్నా రు. దీంతో వీటికీ డిమాండ్ పెరిగింది. పార్టీ బ్యానర్లు, అభ్యర్థుల నిలువెత్తు చిత్రాలు, ప్రచార సామగ్రి, మైక్‌సెట్‌లతో హోరెత్తించే ఆటోరిక్షాలు నగరంలో విరివిగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఐదారు వేలకు పైగా ఆటోలు ప్రచార రథాల అవతారమెత్తాయి. వీటికి ఏ రోజుకు ఆ రోజు వారు తిరిగిన దూరం మేరకు రూ.500 నుంచి రూ.700 వరకు చెల్లిస్తున్నారు.
 
‘అధికార’ ఒత్తిడి
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అధికార టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వాహనాల కోసం తమపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు కొన్ని ట్రావెల్స్ కంపెనీలు ఆరోపిస్తున్నాయి. అతి కష్టంగా వాహనాలను సమకూర్చినప్పటికీ డబ్బులు చెల్లించడం లేదని కొందరు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాల్సి వస్తోందని... ఇది ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు.

Advertisement
 
Advertisement