బదిలీ భయం! | Transfer fear! | Sakshi
Sakshi News home page

బదిలీ భయం!

Jun 22 2016 11:24 PM | Updated on Aug 21 2018 12:21 PM

బదిలీ భయం! - Sakshi

బదిలీ భయం!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయనున్నారా..

జీహెచ్‌ఎంసీలో ఏకీకృత సర్వీస్ రూల్స్?
ఇక ఉద్యోగులకు తప్పని స్థానచలనం
వర్క్‌షాపులో వెల్లడించిన కేటీఆర్
అధికార వర్గాల్లో చర్చోపచర్చలు

 

 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయనున్నారా... బదిలీ అన్నదే తెలియని జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు ఇప్పుడు బదిలీల భయం పట్టుకుందా...ఏళ్ల తరబడి సిటీలో అటో ఇటో తిరుగుతూ ఇక్కడే ఉండిపోయిన ఉద్యోగులు కలవరానికి గురవుతు న్నారా...అంటే అవుననే సమాధానం వస్తోంది. గ్రేటర్ ఉద్యోగ వర్గాల్లో  ఇప్పుడు ‘ఏకీకృత సర్వీస్ రూల్స్’ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సుదీర్ఘ వర్క్‌షాప్‌లో ఈ అంశంపై తీవ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అధికారుల పనితీరు విషయంలో తీవ్ర  అసంతృప్తి వెళ్లగక్కిన మంత్రి కేటీఆర్.. గ్రేటర్ ఉద్యోగులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేస్తామని సృష్టం చేసినట్లు తెలుస్తోంది. బదిలీల భయం లేకపోవడం వల్లే కొన్నిస్థాయిల అధికారులు,  ఉద్యోగులు విధినిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని, ఇకపై ఇలాంటివి సాగవని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. దీనిపై అధికారుల్లో చర్చ జరుగుతోంది.  - సాక్షి, సిటీబ్యూరో

 

సిటీబ్యూరో: ‘ఎంసీహెచ్/జీహెచ్‌ఎంసీలోనే పుట్టాం.. ఇక్కడే ఉంటాం.. మమ్మల్ని ఎవరూ బదిలీ చేయలేరు. మహా అయితే ఆ సర్కిల్ నుంచి ఈ సర్కిల్‌కు. ఈ జోన్ నుంచి ఆ జోన్‌కు. ఎక్కడైనా హైదరాబాద్‌లోనే ఉంటాం .. ’అనే ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు. త్వరలోనే ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ ప్రతిపాదన ఎంతోకాలంగా ఉన్నప్పటికీ, దీనిపై గత ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదు. దీంతో స్థానిక సంస్థల్లో నియమితులైన ఉద్యోగులు అదే స్థానిక సంస్థలో రిటైర్ అయ్యే వరకు కొనసాగే వారు. ఈ నేపథ్యంలో వారి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. జీహెచ్‌ఎంసీతో పాటు  తెలంగాణలోని ఇతర స్థానిక సంస్థల్లోనూ ఇదే పద్ధతి ఉంది. దీంతో  పైస్థాయి ఉద్యోగులే కాక నాలుగో తరగతి అటెండర్లు సైతం తమనెవరూ ఏమీ చేయలేరనే భరోసాతో ఉండేవారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ అంశాలపై సుదీర్ఘ వర్క్‌షాప్ నిర్వహించిన మంత్రి కేటీఆర్ త్వరలో ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి తేనున్నట్లు తెలిపారు. ‘మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. మహా అయితే వేరే సర్కిల్‌కు బదిలీ చేస్తారు అని మీరు భావిస్తుండవచ్చు. కానీ ఇకపై అలాంటి  విధానాలు సాగవు. ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి తెస్తాం. మిమ్మల్ని ఇతర కార్పొరేషన్ లు, మునిసిపాలిటీలకు బదిలీ చేస్తాం. ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాల వారిని ఇక్కడకు బదిలీ చేస్తాం. అయినా  ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైరయ్యే వరకు ఒకేచోట బావిలోని కప్పలా ఉంటే బయటి ప్రపంచం ఏం తెలుస్తుంది?’ అంటూనే ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని మంత్రి కేటీఆర్ పరోక్షంగా హెచ్చరించారు.


మీరు మీ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా..? రోడ్డు మరమ్మతులు, ఫుట్‌పాత్‌ల మీద చెత్త, డెబ్రిస్ వీటిని తొలగించాలని కూడా మంత్రులు, కమిషనర్ చెప్పాలా..? సొంతంగా మీకు ఆలోచ నలు రావా.. ? మన నగరాన్ని మనం బాగు చేసుకుందామని ఎందుకు స్ఫురించదు..? అంటూ ఒకే చోట ఉంటే ఇలాగే తయారవుతారంటూ ఏకీకృత సర్వీసు రూల్స్‌లను అమల్లోకి తేనున్నట్లు వెల్లడించినట్లు  తెలిసింది. ఒక ఇంజినీర్ లేచి మేం చాలా కష్టపడుతున్నాం.. ఉదయం 5 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేస్తున్నామని చెప్పగా, అన్ని గంటలు ఎవరు చేయమన్నారు.. ? స్మార్ట్ వర్క్ చేయాలి .. ఔట్‌పుట్ కనిపించాలి.. అని పరోక్షంగా చురకలంటించినట్లు తెలిసింది. మరొకరు తగినంత స్టాఫ్ లేదనడంతో.. ఉన్నవారు చేస్తున్న పని చేమిటో చెప్పమని ఎదురు ప్రశ్నించారని తెలుస్తోంది. మొత్తానికి ఏకీకృత సర్వీసు రూల్స్ అమల్లోకి తేనున్నట్లు కేటీఆర్ వెల్లడించడంతో కొందరు ఉద్యోగులో భయం పట్టుకుంది. మరికొందరు మాత్రం ఒకే చోట ఉంటే బోర్ కొడుతుందని, మార్పు మంచిదే అంటున్నారు.  జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement