'టైగర్' ఆలే నరేంద్ర కన్నుమూత
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఆలె నరేంద్ర బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
బీజేపీ సీనియర్ నేత ఆలే నరేంద్ర తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా నరేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. రాష్ట్ర రాజకీయాల్లో 'టైగర్' పేరుతో సుపరిచితులు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని బంధువులు తెలిపారు. ఆయనకు భార్య లలిత, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తే ఉన్నారు. 1946 ఆగస్టు 21 తేదిన హైదరాబాద్ పాతబస్తిలోని ఆలియాబాద్ జన్మించారు. ఆయన కుమారుడు ఆలే జితేంద్ర జీహెచ్ ఎంసీ కార్పోరేటర్ గా సేవలందిస్తున్నారు.
హిమయత్ నగర్ శాసన సభకు తొలిసారి ఎన్నికైన నరేంద్ర బీజేపీలో పలు పదవులను చేపట్టారు. మొత్తం మూడుసార్లు హిమాయత్ నగర్ నుంచి గెలుపొందారు. ప్రత్యేక రాస్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ సాధన సమితి పేరుతో పార్టీని నిర్వహించారు. ఆతర్వాత కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణ సాధన సమితిని విలీనం చేశారు. నకిలీ పాస్ట్ పోర్టు కుంభకోణం కేసును సాకుగా చూపించి 2007లో నరేంద్రను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆతర్వాత 2011 జూన్ 27 తేదిన తిరిగి బీజేపీలో చేరారు. యూపీఏ-1 ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ది శాఖామంత్రిగా సేవలందించారు. 13, 14వ లోకసభలో మెదక్ లోకసభ నుంచి ప్రాతినిధ్యం వహించారు. పాతబస్తీ అనే చిత్రంలో విలన్ గా కనిపించారు.
ఆలే నరేంద్ర మృతికి బీజేపీ నేతలు, సీనియర్ రాజకీయ వేత్తలు, తెలంగాణవాదులు సంతాపం ప్రకటించారు.