
ఈ ఏడాది 7,500 విదేశీ ఉద్యోగాలు
నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇళ్లలో పనిచేసేవారు.. ఇలా వివిధ రంగాల్లో విదేశాల్లో చట్టబద్ధంగా ఉపాధి పొందేందుకు...
హోంమంత్రి నాయిని
* టామ్‌కామ్ ద్వారా కల్పించేందుకు కృషి చేస్తున్నాం
* అక్కడి ఉద్యోగాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇళ్లలో పనిచేసేవారు.. ఇలా వివిధ రంగాల్లో విదేశాల్లో చట్టబద్ధంగా ఉపాధి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని రాష్ట్ర హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. స్కిల్డ్, అన్‌స్కిల్డ్ రంగాలతో పాటు కొత్తగా మరో మూడు రంగాల్లోని వారికి టామ్‌కామ్ ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.
సురక్షిత లీగల్ మైగ్రేషన్, విదేశాల్లో ఉపాధి- ప్రభుత్వ ఏజెన్సీల పాత్రపై తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో మంగళవారం గోల్కొండ హోటల్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల సమావేశాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ... ఈ ఏడాది టామ్‌కామ్ ద్వారా 7,500 మంది నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు.
స్కిల్ ఇండియాలో భాగంగా కేంద్ర నిధుల సహకారంతో రాష్ట్రంలోని 6 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, వీటి ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలకు అనుగుణంగా కార్మికులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. విదేశాలకు వెళ్లే కార్మికులు దోపిడీకి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వ కంపెనీ ద్వారా విదేశాలకు పంపడం కోసం టామ్‌కామ్ అనే వేదికను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ చెప్పారు.
గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేసే కార్మికులకు ఆయా దేశాల సాంస్కృతిక అలవాట్లపై టామ్‌కామ్ ముందుగానే అవగాహన కల్పిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది తెలిపారు. ఈ సమావేశంలో డా.రెబెకా తావరస్(యూఎన్ విమెన్ రిప్రజెంటేటివ్), ఓవైఈస్ సర్మాద్ (ఐఎల్‌ఓ చీఫ్ ఆఫ్ స్టాఫ్), డా.మీరా సేతి (ఐఎల్‌ఓ మాక్స్ టూనన్ మైగ్రేషియన్ స్పెషలిస్ట్), కార్మిక ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, టామ్‌కామ్ ఎండీ కె.వై.నాయక్, టామ్‌కామ్ జీఎం కె.భవానీ, ఎన్‌ఆర్‌ఐలు దేవేందర్‌రెడ్డి, ఎం.వెంకట్ భీంరెడ్డి, రుద్ర శంకర్ తదితరులు పాల్గొన్నారు.