breaking news
Home Minister Nayini
-
ఈ ఏడాది 7,500 విదేశీ ఉద్యోగాలు
హోంమంత్రి నాయిని * టామ్‌కామ్ ద్వారా కల్పించేందుకు కృషి చేస్తున్నాం * అక్కడి ఉద్యోగాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇళ్లలో పనిచేసేవారు.. ఇలా వివిధ రంగాల్లో విదేశాల్లో చట్టబద్ధంగా ఉపాధి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని రాష్ట్ర హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. స్కిల్డ్, అన్‌స్కిల్డ్ రంగాలతో పాటు కొత్తగా మరో మూడు రంగాల్లోని వారికి టామ్‌కామ్ ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. సురక్షిత లీగల్ మైగ్రేషన్, విదేశాల్లో ఉపాధి- ప్రభుత్వ ఏజెన్సీల పాత్రపై తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో మంగళవారం గోల్కొండ హోటల్లో ఏర్పాటు చేసిన రెండు రోజుల సమావేశాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ... ఈ ఏడాది టామ్‌కామ్ ద్వారా 7,500 మంది నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు. స్కిల్ ఇండియాలో భాగంగా కేంద్ర నిధుల సహకారంతో రాష్ట్రంలోని 6 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, వీటి ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలకు అనుగుణంగా కార్మికులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. విదేశాలకు వెళ్లే కార్మికులు దోపిడీకి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వ కంపెనీ ద్వారా విదేశాలకు పంపడం కోసం టామ్‌కామ్ అనే వేదికను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ చెప్పారు. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేసే కార్మికులకు ఆయా దేశాల సాంస్కృతిక అలవాట్లపై టామ్‌కామ్ ముందుగానే అవగాహన కల్పిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది తెలిపారు. ఈ సమావేశంలో డా.రెబెకా తావరస్(యూఎన్ విమెన్ రిప్రజెంటేటివ్), ఓవైఈస్ సర్మాద్ (ఐఎల్ఓ చీఫ్ ఆఫ్ స్టాఫ్), డా.మీరా సేతి (ఐఎల్ఓ మాక్స్ టూనన్ మైగ్రేషియన్ స్పెషలిస్ట్), కార్మిక ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, టామ్‌కామ్ ఎండీ కె.వై.నాయక్, టామ్‌కామ్ జీఎం కె.భవానీ, ఎన్ఆర్ఐలు దేవేందర్‌రెడ్డి, ఎం.వెంకట్ భీంరెడ్డి, రుద్ర శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
యువతకు చట్టబద్ధమైన వీసాలు
దుబాయ్‌లో టామ్‌కామ్ రోడ్ షోలో హోం మంత్రి నాయిని సాక్షి, హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వచ్చే తెలంగాణ యువతకు చట్టబద్ధమైన కంపెనీ వీసాలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం దుబాయ్‌లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ (టామ్‌కామ్) నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి నాయినితోపాటు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. రాష్ట్ర యువతకు ఉపాధి కోసం విదేశాల్లోని కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. కొందరు దళారీలను నమ్మి మోసపోతున్నారని, విజిట్ వీసా, ఆజాద్ వీసా, ఫ్రీ వీసా, ప్రైవేట్ వీసాలపై వస్తూ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్నారు. ఇక నుంచి ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటుందని చెప్పారు. ఇందుకు టామ్‌కామ్ ఇక్కడి కంపెనీలతో చర్చలు జరుపుతుందన్నారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికుల కోసం ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టిందని వివరించారు. -
బోనాలకు 10 కోట్లు
-
బోనాలకు 10 కోట్లు
* ప్రభుత్వం తరఫున వైభవంగా ఏర్పాట్లు * హోంమంత్రి అధ్వర్యంలో మంత్రుల కమిటీ * అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల ఉత్సవాన్ని జంటనగరాల్లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఉత్సవ ఏర్పాట్ల కోసం రూ.10 కోట్లు కేటాయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరో రూ.5 కోట్లు వెచ్చించనుంది. బోనాల పండుగ ఏర్పాట్లపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బోనాల పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తగిన ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయ శాఖ ద్వారా రూ.5 కోట్లు, జీహెచ్ఎంసీ ద్వారా రూ.5 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రదీప్ చంద్రను ఆదేశించారు. బోనాల ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావుతో మంత్రుల కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. మంత్రుల కమిటీ జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుని బోనాలు ఘనంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్‌ను సీఎం ఆదేశించారు. బోనాలు జరిగే అన్ని దేవాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, రహదారులు శుభ్రంగా ఉండేలా చూడాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. సమీక్షలో మంత్రులు నాయిని, తలసాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గానికి రూ.20 లక్షలు బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పాతబస్తీలోని ఒక్కో ఆలయానికి రూ. 3 లక్షలు, పాతబస్తీ మినహా మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.20 లక్షల చొప్పున కేటాయించామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. ఈ నిధులను ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, దేవాదాయ, మున్సిపల్ అధికారులతో ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. హోంమంత్రి నాయిని అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస యాదవ్, నగరానికి చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం నాయిని విలేకరులతో మాట్లాడుతూ.. జంటనగరాల్లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, దేవాలయ ప్రాంగణాల్లో భారీగా విద్యుత్ దీపాల అలకంరణ చేయనున్నట్లు తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్లను ఆదేశించినట్లు చెప్పారు. రాజకీయాలకతీతంగా అందరం కలసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. జాతీయ స్థాయిలో బోనాలకు ప్రచారం కల్పిస్తాం బోనాల విశిష్టత, ప్రాశస్త్యాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడమే ఉద్దేశంగా ఢిల్లీలో బోనాల పండుగ నిర్వహించనున్నట్టు లాల్ దర్వాజ సింహవాహిని మహాంకాళి (హైదరాబాద్) ఆలయ కమిటీ చైర్మన్ మాణిక్ ప్రభు గౌడ్, సలహా బోర్డు చైర్మన్ ముఖేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో బోనాల ఉత్సవాల నిర్వహణ వివరాలు వెల్లడించారు. తెలంగాణ భవన్లో మంగళవారం సాయంత్రం మహాంకాళి విగ్రహ ప్రతిష్ట చేయనున్నామన్నారు. పోతురాజు, ఘటం, బంగారు, వెండి బోనాల కార్యక్రమం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో తానా మహాసభల్లో బోనాల పండుగ నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేడు బల్కంపేట ఎల్లమ్మ గుడికి సీఎం దంపతులు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు జరిగే కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరుకానున్నారు. మంత్రి తలసాని అధ్వర్యంలో పలువురు వేద పండితులు, పురోహితులు సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలసి కల్యాణోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు బాలకృష్ణశర్మ అధ్వర్యంలో ముఖ్యమంత్రికి ఆశీర్వాదం ఇచ్చారు. -
పట్టాల పంపిణీలో హోం మంత్రి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న బలిజ సంఘంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి ప్రసంగించారు. అనంతరం అర్హులైన పేదలకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు.