ఇందుకే ఐఎస్ వ్యూహం మారింది..! | This reason isis strategy was changed ..! | Sakshi
Sakshi News home page

ఇందుకే ఐఎస్ వ్యూహం మారింది..!

Published Sat, Jul 2 2016 9:34 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

ఇందుకే ఐఎస్ వ్యూహం మారింది..!

ఇందుకే ఐఎస్ వ్యూహం మారింది..!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మారణహోమం తలపెట్టాలని భావించిన ఐసీస్ అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రమూకల వ్యూహం మారిందా?

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మారణహోమం తలపెట్టాలని భావించిన ఐసీస్ అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రమూకల వ్యూహం మారిందా? ముస్లింల పవిత్రమాసం రంజాన్ పండుగ తర్వాత విధ్వంసం సృష్టించాలనుకున్నారా? ఆ తర్వాత ఐసిస్ ఆదేశాల మేరకు నిర్ణయం మార్చుకున్నారా? అవుననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) వర్గాలు. ముందు నిర్ణయించినట్లుగా కాకుండా రంజాన్‌కు వారం రోజుల ముందుగానే పేలుళ్లు జరపాలని నిర్ణయించినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగు చూసింది. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన ఉగ్రమూకలను న్యాయస్థానం  ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు శనివారం ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు.

కస్టడీలోకి తీసుకున్న ఐదుగురిని బృందాలుగా, విడివిడిగా కూర్చొబెట్టి కుట్రకోణంపై ఆరా తీశారు. వీరిలో కీలకమైన వ్యక్తులుగా భావిస్తున్న మహ్మద్ ఇబ్రహీం యాజ్దానీ, హబీబ్ మహ్మద్‌ అలియాస్ యూసఫ్ గుల్షన్‌లను ఎక్కువ సమయం ప్రశ్నించినట్లు తెలిసింది. వీరి ద్వారానే ఐసిస్ ప్రతినిధి అబ్ మహ్మద్ అల్ అద్నానీ పాత్ర వెలుగు చూసింది. అబ్ మహ్మద్ ప్రోద్బలంతోనే పేలుళ్లను వారం రోజుల ముందుకు మార్చినట్లు ఎన్‌ఐఏ అధికారులకు వెల్లడించారు. వాస్తవానికి రంజాన్ తర్వాత పేలుళ్లు జరపాలని భావిస్తే... అబ్ మహ్మద్ మాత్రం తీవ్రంగా వాదించి వారం రోజులు ముందుగా అది కూడా శని, ఆదివారాల్లో జరపాలని ఆదేశించినట్లు తెలిపారు.

అందుకోసం అబ్ మహ్మద్ ప్రత్యేకంగా 30 నిమిషాల నిడివి గల ఆడియోను ఆన్‌లైన్ ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు. పేలుళ్లకు మొదట్లో విముఖత చూపిన వారు సైతం అబ్ మహ్మద్ ఆడియో విన్న తర్వాత ఆసక్తి కనబర్చారు. దీంతో ఆ ప్రత్యేక ఆడియోలో అతడు ప్రస్తావించిన అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 
షఫీ ఆర్మర్ ఆధ్వర్యంలో రిక్రూట్‌మెంట్లు...
సిరియాలో ఉన్న ఐసిస్ ముఖ్యనేత షఫీ ఆర్మర్ కనుసన్నల్లో పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్లు చేసినట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన షఫీ ఆర్మర్ ఐసిస్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 
ఇబ్రహీం సౌదీ టూర్‌పై ఆరా...
మహ్మద్ ఇబ్రహీం యాజ్దానీ రెండు నెలల కిత్రం సౌదీ అరేబియా వెళ్లి వచ్చినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఆ పర్యటనలో ఎవరెవరితో సమావేశమయ్యారనే దానిపై లోతుగా ఆరా తీస్తున్నారు. సౌదీలో షఫీ ఆర్మర్ మారుపేర్లతో వచ్చి ఇబ్రహీంతో చర్చించినట్లు సమాచారం. 
ఎఫ్‌ఎస్‌ఎల్‌కు చేరిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు..
ఉగ్రమూకల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ సైన్స్  ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపించారు. బుధవారం పాతబస్తీలో పట్టుబడిన వారి నుంచి ఎన్‌ఐఏ అధికారులు దాదాపు 40 సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్‌లతో పాటు పెద్ద మొత్తంలో పలు రసాయన పదార్థాలు లభించాయి. ఎలక్ట్రానిక్ పరికరాలలో నిక్షిప్తమైన సమాచారాన్ని వెలికితీయాలని ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులకు సూచించారు.
నేడు మహారాష్ట్ర తీసుకెళ్లే యోచన..
తమ కస్టడీలో ఉన్న ఐదుగురు ఉగ్రమూకలను నేడు మహారాష్ట్రకు తీసుకెళ్లాలని ఎన్‌ఐఏ అధికారులు యోచిస్తున్నారు. ఇబ్రహీం యాజ్దానీ మహారాష్ట్రలోని నాందెడ్‌లో పలు ప్రాంతాల్లో పర్యటించడం, అక్కడే ఆయుధాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో ఆయుధాల కొనుగోలుకు సహకరించిన వారితో పాటు అక్కడున్న పరిచయాలపై ఆరా తీయనున్నారు. అనంతరం అక్కడి నుంచి రాజస్థాన్‌లో ఇబ్రహీం పర్యటించిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement