ఆ చట్టాలు మరో రాష్ట్రానికి వర్తించవు

ఆ చట్టాలు మరో రాష్ట్రానికి వర్తించవు - Sakshi


విభజన తరువాత పదవీ విరమణ పెంపు సవరణపై హైకోర్టు



సాక్షి, హైదరాబాద్‌: పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచుతూ ఆంధప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్టం 1984కు ఏపీ చేసిన సవరణలు తెలంగాణ ఉద్యోగులకు వర్తించవని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా కొత్త చట్టం లేదా సవరణలు తెచ్చినప్పుడు అవి ఆటోమేటిక్‌గా ఇరు రాష్ట్రాలకు వర్తించవని తేల్చి చెప్పింది. పదవీ విరమణ వయస్సును 60కు పెంచుతూ ఏపీ చేసిన చట్ట సవరణను అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ పోలీస్‌ అకాడమీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (కోఆర్డినేషన్‌)గా పనిచేస్తున్న అదనపు ఎస్పీ ఎం.సర్వేశ్వర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.



ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఉమ్మడి ఏపీలోని ఆంధప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్టాన్ని తెలంగాణ వర్తింపచేసుకుందని, అందువల్ల పదవీ విరమణ వయస్సు పెంపు సవరణను కూడా అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వా న్ని ఆదేశించాలని కోరుతూ సర్వేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌లో కోరారు.



ఆ అధికారం లేదు...

ఈ వ్యాజ్యంపై వాదనలు విన్న ధర్మాసనం... ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్‌ 101 ప్రకారం అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న చట్టాన్ని తమకు వర్తింప చేసుకోవడం లేదా మార్చడానికే తెలంగా ణకు అధికారం ఉందే తప్ప, రాష్ట్ర విభజన తరువాత ఏపీ చేసిన చట్టాన్ని వర్తింపచేసు కోవడానికి వీల్లేదంది. ఒకవేళ పిటిషనర్‌ వాదనలతో ఏకీభవిస్తే, తదనుగుణ ఫలితాలు అందరినీ భయపెట్టే విధంగా ఉంటా యంది. చట్టాలు వర్తింపచేసుకునే విషయం లో రాష్ట్రాలు ఏ విధంగా వ్యవహరించాలో కేంద్రం పునర్విభజన చట్టంలో స్పష్టంగా చెప్పిందని వివరించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top