
విద్యుత్ సంస్థల్లో రగులుతున్న ఉద్యోగుల పదవీ విరమణ గడువు పెంపు
అన్నింటిలో కలిపి ప్రస్తుతం 34,582 మంది శాశ్వత ఉద్యోగులు
వీరికి 62 ఏళ్ల వరకూ పదవీ విరమణ గడువు పెంచే యోచనలో చంద్రబాబు సర్కారు
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక కొత్త ఎత్తుగడ
త్వరలో రిటైరయ్యే 3,782 మందిని మరో రెండేళ్లపాటు కొనసాగించేందుకు యత్నం
నష్టం, కష్టం భరించలేక స్వచ్ఛంద పదవీ విరమణ బాటలో ఉద్యోగులు
వీలైతే రిటైర్‌మెంట్ వయస్సు 58 ఏళ్లకు తగ్గించాలని ఒత్తిడి
సాక్షి, అమరావతి: ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ఉంది సీఎం చంద్రబాబునాయుడు తీరు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, అన్ని ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఉద్యోగాల నియామకం చేపడతామని ఎన్నికల ముందు చెప్పిన ఆయన గద్దెనెక్కాక మాట తప్పారు. పైగా.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా.. విద్యుత్ సంస్థల్లో ఎలాంటి నియామకాలు చేపట్టకుండా, ఉన్నవారిపై పని ఒత్తిడిని పెంచేస్తున్నారు. కనీసం వయసు పైబడడంతో ఉద్యోగ విరమణ చేద్దామనుకున్న వారికి సైతం మోకాలడ్డుతున్నారు.
వారికి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఆయా విద్యుత్ సంస్థ (ట్రాన్స్‌కో, జెన్‌కో, నెడ్‌క్యాప్, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్)ల్లో ఇటీవల పదవీ విరమణ చేసిన వారు, త్వరలో చేయబోతున్న వారి వివరాలను ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
దీనికి కొనసాగింపుగా.. ఈనెల 22న అధికారికంగా ఇదే విషయంపై జీఓ విడుదల చేసింది. అయితే, ప్రభుత్వ చర్యల ఫలితంగా విద్యుత్ శాఖలో ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ బాటపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల్లో (డిస్కం) ఉన్నతాధికారులు సైతం ఉద్యోగం వదులుకుని వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే యాజమాన్యానికి తమ అభ్యర్థనలను పంపుతున్నారు. ఇటీవల ఓ ఎస్‌ఈ అభ్యర్థనను ఏపీఈపీడీసీఎల్ ఆమోదించడంతో ఆయన త్వరలో రిటైర్ కానున్నారు.
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌కు భయపడే..
విద్యుత్ సంస్థల్లో 1990 నుంచి 1998 వరకూ నియామకాలు ఎక్కువగా జరిగాయి. ప్రస్తుతం అన్నింటిలో కలిపి 34,582 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. వీరంతా 2026 నుంచి 2030 మధ్య పదవీ విరమణ చేయనున్నారు. వీరందరికీ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఉదా.. ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారికి రిటైర్‌మెంట్ బెనిఫిట్ రూ.కోటి ఇవ్వాలి. అలాగే, లైన్ ఇన్‌స్పెక్టర్ స్థాయి వాళ్లకు రూ.35 లక్షలు ఇవ్వాలి.
ఇలా పదవీ విరమణ చేసేవారు వేలల్లో ఉన్నారు. వీరందరికీ బెనిఫిట్స్ ఇవ్వడానికి భయపడిన ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచాలనే కుట్రకు ప్రణాళిక రచించింది. దీనివల్ల త్వరలో రిటైర్ కావాల్సి ఉన్న 3,782 మంది మరో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. అంటే.. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ విద్యుత్ సంస్థల్లో కొత్తగా నియామకాలు చేపట్టకుండా, ఉన్నవారికి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా గడపేయాలనుకుంటున్నారనే అనుమానాలు అటు ఉద్యోగులను, ఇటు నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఉద్యోగులెవరికీ ఇష్టం లేదు..
నిజానికి.. విద్యుత్ సంస్థల్లో కార్మికులు, ఇంజనీర్లు, అకౌంట్స్, మానవ వనరుల శాఖ అనే నాలుగు ప్రధాన విభాగాలున్నాయి. వీటిలో కార్మికులు, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ఉద్యోగంలో చేరేనాటికి వారి వయసు సగటున 25 ఏళ్లు అనుకుంటే.. అప్పటి నుంచి విద్యుత్ స్తంభాలు ఎక్కడం, ఎత్తడం, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు.. లైన్లు లాగడం వంటి గట్టి పనులు ప్రతికూల పరిస్థితుల్లోనూ చేయాలి. 45 వచ్చాక వీరిలో ఈ శక్తి తగ్గుతూ వస్తుంది. 50 ఏళ్లు దాటాక పరిస్థితి ఇంకా విషమిస్తుంది. ఆ తర్వాత పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో.. ఉద్యోగులెవరూ సర్వీసు పొడిగింపును ఇష్టపడటంలేదు.
పనికి తగ్గ ప్రయోజనం లేదు..
ఇక సిబ్బంది కొరతవల్ల ఒకొక్కరూ నాలుగైదు విభాగాలు పర్యవేక్షించాల్సి వస్తోంది. కిందిస్థాయి సిబ్బంది లేకపోవడంవల్ల పర్యవేక్షణ లోపించి, ఇటీవల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. పైగా.. పదవీ విరమణ బెనిఫిట్స్‌పై వచ్చే వడ్డీ కంటే వయసు పెంచి ఇచ్చే జీతం తక్కువ. దీంతో.. పదవీ విరమణ వయసును పెంచడం ఉద్యోగులెవరికీ ఇష్టంలేదు. మరోవైపు.. పర్సనల్ పే అంటూ రూ.2.59 లక్షలకు సీలింగ్ విధించారు.
ఫలితంగా.. ఒక ఏఈ, ఏడీఈ, అకౌంట్స్ అధికారి స్థాయి ఉద్యోగి దాదాపు 15 ఏళ్లపాటు ఎలాంటి ఇంక్రిమెంట్లు లేకుండా పనిచేయాలి. అలా పనిచేయడానికి ఎవరూ ఇష్టపడటంలేదు. నిజానికి.. విద్యుత్ సంస్థల బడ్జెట్లో ఉద్యోగులకు 20 శాతం వరకూ ఖర్చుపెట్టొచ్చు. కానీ, ప్రస్తుతం 8 శాతం మాత్రమే వెచ్చిస్తున్నారు. దీంతో వారు స్వచ్ఛంద పదవీ విరమణకే మొగ్గుచూపుతున్నారు. వీలైతే 58 ఏళ్లకు తగ్గించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచాల్సిందిగా ఉద్యోగ సంఘాల నేతలపై ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు.
ప్రైవేటు పరం చేయాలనే కుట్ర..
మరోవైపు.. ఐటీఐ, ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులు చేసి బయటకొస్తున్న రాష్ట్ర యువతరం లక్షల్లో ఉన్నారు. అయితే, 2014 నుంచి విద్యుత్ సంస్థల్లో రిక్రూట్‌మెంట్ చేయడంలేదు. ఈ నేపథ్యంలో.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దాదాపు 8 వేల మందికి అప్పటి సీఎం వైఎస్ జగన్ ఎనర్జీ అసిస్టెంట్లుగా విద్యుత్ శాఖలో ఉద్యోగాలు కల్పించారు. వీరివల్ల ప్రస్తుతం విద్యుత్ సంస్థలు మనుగడ సాగించగలుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విద్యుత్ శాఖను నిర్వీర్యం చేసి, నష్టాల్లోకి నెట్టేసి ప్రైవేటుపరం చేయాలనే కుట్ర జరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ప్రయత్నాలను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా సమ్మెలకు సిద్ధమవుతున్నాయి. కానీ, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా ప్రైౖవేటుపరం వైపే అడుగులు వేస్తోంది. దీనిపై మంత్రుల కమిటీ వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది.