రాష్ట్రవ్యాప్తంగా ‘ఆ రెండు’ పోలీస్ యాప్స్ | That two Police Apps state wide | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా ‘ఆ రెండు’ పోలీస్ యాప్స్

Jun 16 2016 4:21 AM | Updated on Aug 21 2018 6:12 PM

రాష్ట్రవ్యాప్తంగా ‘ఆ రెండు’ పోలీస్ యాప్స్ - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా ‘ఆ రెండు’ పోలీస్ యాప్స్

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పోలీసులు రూపొందించి, వినియోగిస్తున్న పోలీస్ యాప్స్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయించారు.

- అన్ని జిల్లాల్లోనూ ‘హైదరాబాద్ కాప్’, ‘360 డిగ్రీస్ వ్యూ’
- వినియోగించాలని నిర్ణయించిన డీజీపీ అనురాగ్ శర్మ
- పోలీసు ఉన్నతాధికారులతో భేటీలో ఆదేశాలు జారీ
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పోలీసులు రూపొందించి, వినియోగిస్తున్న పోలీస్ యాప్స్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 6 నెలలుగా ఈ యాప్స్‌ను సిటీ పోలీసులు వినియోగిస్తున్నారు. డీజీపీ ఆదేశాల నేపథ్యంలో ఈ యాప్స్‌లో అవసరమైన మార్పులుచేర్పులు చేయడానికి సిటీ పోలీసు ఐటీ సెల్ సన్నాహాలు చేస్తోంది.

 ఇదీ ‘హైదరాబాద్ కాప్’..
 ఠాణాల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలకు గస్తీ సిబ్బంది కచ్చితంగా వెళ్లిరావడం కోసం ఈ-బీట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ యాప్ అక్షాంశ, రేఖాంశాలను గ్రహించడం ద్వారా లోపాలకు తావు లేకుండా ఆయా ప్రాంతాలకు వెళ్లేలా చేస్తుంది. పోలీసుస్టేషన్ల వారీగా క్రైమ్ ప్రోన్ ఏరియాలను గుర్తించి, జీపీఎస్ మ్యాపింగ్ రూపంలో అందుబాటులోకి తెచ్చారు. గస్తీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అప్రమత్తం చేసే ప్రత్యేక వ్యవస్థ ఈ యాప్‌లో ఉంది. ఓ వాహనచోదకుడు వాహనానికి చెందిన పత్రాలను పోలీసులకు తనిఖీ సమయంలో చూపినప్పుడు ఆ జిరాక్సు ప్రతులు అసలువో కాదో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మరోపక్క చోరీ వాహనాల జాబితానూ ఈ యాప్‌కు అనుసంధానిస్తున్నారు. పాత నేరగాళ్ల చిరునామాలు, జైలు నుంచి విడుదలవుతున్న వారి వివరాలనూ పొందుపరిచారు. ఏదైనా నేరం జరిగిన వెంటనే అలాంటి నేరాలు చేసే వాళ్లు ఎవరున్నారు? వారు ప్రస్తుతం ఎక్కడున్నారు? అనేవి తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిత్యం తప్పిపోయిన, గుర్తుతెలియని శవాల కేసులు నమోదవుతుంటాయి. ఈ యాప్ వల్ల ఫిర్యాదు వచ్చిన మరుక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా సరిచూడటానికి అవకాశం ఉంటుంది.
 
 ‘360 డిగ్రీస్ వ్యూ’ ఉపయోగం ఇలా..
 రాష్ట్రంలో ఏటా వేల కేసులు నమోదవుతుంటాయి. వీటిలో అరెస్టయ్యే నిందితులందరినీ పోలీసులు గుర్తుంచుకోవడం కష్టం. రిపీటెడ్ అఫెండర్స్ తమ చరిత్ర వెలుగులోకి రాకుండా ఉండేందుకు అరెస్టైనప్పుడు తమ పేర్లలో స్వల్ప మార్పులు చేసి చెప్తుంటారు. ఇలాంటి ‘మార్పిడిగాళ్లు’ పూర్తిగా తమ పేర్లను మార్చరు. అరెస్టు అయినప్పుడు బెయిల్ పొందడం కోసం కోర్టులో ధ్రువీకరణలు ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు పేరు చెప్తే అక్కడ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా స్పెల్లింగ్స్ మార్చేస్తూ కథ నడుపుతున్నారు. ఇలాంటి వారికి ‘360 డిగ్రీస్ వ్యూ’ చెక్ చెప్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో అరెస్టు అయిన వ్యక్తుల వివరాలతో పాటు ఇతర విభాగాలకు చెందిన డేటాబేస్‌లైన డ్రైవింగ్ లెసైన్స్, రేషన్‌కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను సర్వర్‌కు అనుసంధానిస్తారు. ఈ సాఫ్ట్‌వేర్ వీటన్నింటినీ సెర్చ్ చేసి సదరు వ్యక్తి ‘పేర్లు’ మార్చుకున్నా ఆ వివరాలన్నింటినీ అందిస్తుంది. దీన్ని పోలీసు విభాగం కంప్యూటర్లతో పాటు ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్, సెల్‌ఫోన్ల నుంచీ ఈ సెర్చ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలీసులకు శిక్షణ ఒక సవాల్: డీజీపీ
 సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖలో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి శిక్షణ ఇవ్వడం ఒక సవాల్‌తో కూడుకున్న అంశమని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం డీజీపీ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐల నియామకం భారీగా జరుగుతోందన్నారు. పోలీసు స్టేషన్ల ఆధునికీకరణ, సైబర్ క్రైమ్, సమాచార సాంకేతిక వ్యవస్థ, నేరాల అదుపుకు తీసుకుంటున్న చర్యలు, కృష్ణా పుష్కరాలు, రాబోయే పలు పండుగలు సందర్భంగా తీసుకుంటున్న భద్రతా చర్యలను ఈ సమావేశంలో సమీక్షించారు. 2015 సంవత్సరానికి అందించిన సేవలకు గాను అవార్డులు పొందిన అధికారులకు ధ్రువీకరణ పత్రాలను డీజీపీ అందజేశారు. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు రాజీవ్ త్రివేది, మహేందర్ రెడ్డి, పూర్ణచందర్‌రావు, గోపీకృష్ణ, గోవింద్‌సింగ్, అంజనీకుమార్, డాక్టర్ ఈష్‌కుమార్, రవిగుప్తా, సందీప్ శాండిల్య, సి.వి.ఆనంద్, బాలనాగదేవితో పాటు ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement