దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆలయాల్లోని అర్చకులు, ఉద్యోగుల వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించనప్పటికీ ...
సమ్మె యోచనపై ప్రస్తుతానికి వెనక్కు
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆలయాల్లోని అర్చకులు, ఉద్యోగుల వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించనప్పటికీ కొంతకాలం వేచిచూసే ధోరణి అవలంబించాలని దేవాదాయశాఖ ఆలయ ఉద్యోగులు, అర్చకుల జేఏసీ నిర్ణయించింది. ఫిబ్రవరి ఐదో తేదీ నాటికి సానుకూల నిర్ణయం ప్రకటించని పక్షంలో ఏడో తేదీ నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ గతంలో హెచ్చరించినప్పటికీ... మరికొన్ని రోజులు వేచిచూడాలని ఆదివారం బర్కత్‌పురాలోని అర్చక భవన్‌లో జరిగిన సమావేశంలో తాజాగా నిర్ణయించారు.
అర్చకులు, దేవాలయ ఉద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సానుకూలంగానే ఉన్నప్పటికీ కొందరు ఆయనకు తప్పుడు సమాచారమిస్తూ పక్కదారిపట్టిస్తున్నారని జేఏసీ నేత గంగు భానుమూర్తి పేర్కొన్నారు. ఈనేపథ్యంలో నేరుగా ముఖ్యమంత్రినే కలసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే సమ్మెకు దిగాలని భావిస్తున్నట్లు నేతలు తెలిపారు.