శాసనసభ ఉద్యోగుల విభజనపై త్వరలో సీఎస్‌లతో భేటీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ, మండళ్లలో పనిచేసే ఉద్యోగుల విభజన అంశంపై త్వరలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో భేటీ నిర్వహించాలని ఏపీ, తెలంగాణ సభాపతులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎస్.మధుసూదనాచారి నిర్ణయించారు.
	► ఉభయ రాష్ట్రాల స్పీకర్ల నిర్ణయం.. మే 10 తర్వాత సమావేశం జరిగే అవకాశం
	 
	సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ, మండళ్లలో పనిచేసే ఉద్యోగుల విభజన అంశంపై త్వరలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో  భేటీ నిర్వహించాలని ఏపీ, తెలంగాణ సభాపతులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎస్.మధుసూదనాచారి నిర్ణయించారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు దాటుతున్నా ఇంత వరకూ ఉద్యోగుల విభజన పూర్తవలేదు. దీంతో ఉద్యోగుల విభజనతో పాటు పదోన్నతుల అంశాన్నీ పరిశీలించాల్సిందిగా చాలా రోజులుగా ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.
	
	ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల సభాపతులు శనివారం సమావేశమయ్యారు. ఉభయ రాష్ట్రాల శాసనమండలి చైర్మన్లు ఏ.చక్రపాణి, స్వామిగౌడ్, శాసనసభ కార్యదర్శులు రాజా సదారాం. కె.సత్యనారాయణ పాల్గొన్నారు. ఉద్యోగుల విభజన అంశం క్లిష్టతరమైంది కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను భాగస్వాములను చేయాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.
	
	దీంతో మే 10 తర్వాత రెండు రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇకపై ఏపీ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరిపేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగుల్లో మెజారిటీ భాగం తమను తెలంగాణ అసెంబ్లీకి కేటాయించాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగుల విభజన సమయంలో ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ తన వాదనగా సమావేశంలో వినిపించింది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
