శ్రీనగర్‌కాలనీ: నగరంలో మహిళల రక్షణ భద్రతకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాలను అదుపులోకి తెచ్చామని అడిషనల్ సీపీ స్వాతి లక్రా అన్నారు. మంగళవారం లామకానలో సైబర్ స్టాకింగ్, మహిళారక్షణ, పోలీసు వ్యవస్థలో మార్పులు తదితర అంశాలపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నామని, నేరం చేసిన వారు తప్పించుకోలేరన్నారు. మహిళల్లోని భయాలను తొలగిస్తూ వారికి అవగాహన కల్పిస్తూ వారు నిర్భయంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు, మహిళా పోలీసుల సంఖ్య పెంచామని, మహిళల కోసం ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా సంఘటన జరిగితే క్షణాల్లో పోలీసులు అక్కడ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. . సోషల్ మీడియాల సహకారంతో ఎప్పటికప్పుడు ఉన్నత సేవలు అందిస్తున్నట్లు వివరించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని నేరం చేసిన వారెవరూ తప్పించుకోలేరన్నారు. ఈ సందర్భంగా పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సామాధానంఇచ్చారు. విద్యార్థులు, పౌరులు పోలీస్ స్టేషన్లలను దర్శించి టెక్నాలజీ వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.