నాలా పన్ను తగ్గింపు | tax decrease under hmda | Sakshi
Sakshi News home page

నాలా పన్ను తగ్గింపు

Jan 4 2016 1:19 AM | Updated on Sep 3 2017 3:01 PM

రియల్ వ్యాపారానికి వెన్నుదన్నుగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం జరిగిన సుదీర్ఘ కేబినెట్ సమావేశం, తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) విజ్ఞప్తుల్లో కొన్నింటిని ఆమోదించింది.

► హెచ్‌ఎండీఏ పరిధిలో 9 నుంచి 3 శాతానికి కుదింపు
► గ్రేటర్ పరిధిలో 5 నుంచి 2 శాతానికి తగ్గింపు
► కేబినెట్ నిర్ణయాలపై ప్రకటన చేయని సీఎంవో

 

 సాక్షి, హైదరాబాద్:  రియల్ వ్యాపారానికి వెన్నుదన్నుగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం జరిగిన సుదీర్ఘ కేబినెట్ సమావేశం, తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) విజ్ఞప్తుల్లో కొన్నింటిని ఆమోదించింది. గతంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు చెల్లించే వ్యవసాయేతర భూముల మదింపు (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్‌మెంట్-నాలా) పన్నును భారీగా తగ్గించింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్ విలువపై 5 శాతం, హెచ్‌ఎండీఏ పరిధిలో 9 శాతం నాలా పన్ను వసూలు చేస్తున్నారు.

తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం హెచ్‌ఎండీఏ పరిధిలో 9 శాతమున్న నాలా పన్నును 3 శాతానికి, గ్రేటర్ పరిధిలో 5 శాతమున్న పన్నును 2 శాతానికి తగ్గించనున్నారు. ట్రెడా విజ్ఞప్తుల్లో ఆమోదించిన 23 అంశాలకు సంబంధించిన ప్రకటనను ఆదివారం జారీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినేట్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించడం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరెంటు బిల్లుల బకాయిల మాఫీ అంశంపై కూడా ప్రకటన విడుదలవుతుందని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఈ ప్రకటనను విడుదల చేయకపోవటం గమనార్హం. దీంతో నేరుగా కేబినెట్ ఆమోదించిన నిర్ణయాలపై ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement