చలో... లంకను చూసొద్దాం! | Special Package to Sri Lanka tour | Sakshi
Sakshi News home page

చలో... లంకను చూసొద్దాం!

Apr 13 2016 12:03 AM | Updated on Nov 9 2018 6:39 PM

చలో... లంకను చూసొద్దాం! - Sakshi

చలో... లంకను చూసొద్దాం!

వేసవి సందర్భంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) మరో విదేశీ పర్యటనకు ప్యాకేజీని సిద్ధం చేసింది.

 శ్రీలంక పర్యటనకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ
 జూన్ 4 నుంచి 8 వరకు షెడ్యూల్

 
 సాక్షి, హైదరాబాద్: వేసవి సందర్భంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) మరో విదేశీ పర్యటనకు ప్యాకేజీని సిద్ధం చేసింది. శ్రీలంకలోని పలు ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు ప్రణాళికను రూపొందించింది. గతంలో ఏర్పాటు చేసిన థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, దుబాయ్ పర్యటనలు విజయవంతం కావడంతో తాజాగా శ్రీలంక యాత్రకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. శాంకరీదేవి శక్తిపీఠ్ సందర్శనతోపాటు, ఈ పర్యటనలో పలు దేవాలయాల సందర్శన ఉంటుంది.

జూన్ 4వ తేదీ ఉదయం 9.55 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం ఎస్‌జీ-1042 విమానంలో బయలుదేరి 11.45 గంటలకు మదురై చేరుకుంటారు. అక్కడి నుంచి ఎస్‌జీ-3 విమానంలో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి 1.50 గంటలకు కొలంబో చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీలంకలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం జూన్ 8వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎస్‌జీ-4 విమానంలో కొలంబో నుంచి బయలుదేరి 2.55 గంటలకు మదురై చేరుకుంటారు. అదేరోజు సాయంత్రం 4.10 గంటలకు మదురై నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
 
 సందర్శనీయ స్థలాలు...
 ఈ పర్యటనలో పూంచి కటార్గమా టెంపుల్, మనవారి టెంపుల్, మున్నేశ్వరం, ట్రింకోమలి, శాంకరీదేవి (పాత, కొత్త శక్తిపీఠం)ఆలయం, నిలవేలి బీచ్, లక్ష్మీనారాయణ టెంపుల్, కణ్ణయ వేడినీటి ప్రదేశం, సిగారియారాక్ డ్రైవ్, కాండి సిటీటూర్, కల్చరల్ షో, టెంపుల్ ఆఫ్ టూత్ రెలిక్, టీ ఫ్యాక్టరీ, రాంబోడ హనుమాన్ టెంపుల్, గాయత్రీపీఠం, సీత అమ్మాన్ టెంపుల్, అశోక టెంపుల్, కొలంబో సిటీటూర్ తదితర ప్రాంతాలు ఈ పర్యటనలో ఉన్నాయి. ఈ ప్యాకేజీలో ఐఆర్‌సీటీసీయే అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. త్రీస్టార్ హోటల్‌లో బస, ఏసీ సదుపాయంతో కూడిన వాహనాల్లో రోడ్డు రవాణా, గైడ్స్, భద్రతా సిబ్బంది, ఇండియన్ రెస్టారెంట్‌లలో భోజన సదుపాయం, వీసా చార్జీలు, ట్రావెలింగ్ బీమా, పర్యటనలో భాగంగా మినరల్‌వాటర్‌తో సహా అన్ని సదుపాయాలను కల్పిస్తారు.
 
 చార్జీలు...
 హైదరాబాద్-శ్రీలంక పర్యటన చార్జీ ఒక్కొక్కరికి రూ.43,836 చొప్పున ఉంటుంది. అన్ని సదుపాయాలతో  కలిపి ఈ చార్జీని నిర్ణయించారు. ఈ పర్యటనకు సంబంధించిన బుకింగ్, ఇతర వివరాల కోసం ఫోన్ నంబర్‌లు 040-2770 2407,040-2380 0580, 97013 60605 నంబర్లలో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement