త్వరలో కార్పొరేటర్ల ‘నగర దర్శనం’ | Soon corporators 'location, view' | Sakshi
Sakshi News home page

త్వరలో కార్పొరేటర్ల ‘నగర దర్శనం’

Apr 12 2016 12:21 AM | Updated on Aug 15 2018 9:30 PM

త్వరలో కార్పొరేటర్ల   ‘నగర దర్శనం’ - Sakshi

త్వరలో కార్పొరేటర్ల ‘నగర దర్శనం’

గ్రేటర్‌లో మరోమారు ‘స్వచ్ఛ హైదరాబాద్’ తరహా కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్పొరేటర్లు....

సమస్యలు తెలుసుకునేందుకు కలసికట్టుగా.. మరోమారు ‘స్వచ్ఛ హైదరాబాద్’
చెత్తను తుడిచిపెట్టేందుకు.
.

 

సిటీబ్యూరో:  గ్రేటర్‌లో మరోమారు ‘స్వచ్ఛ హైదరాబాద్’ తరహా కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలను భాగస్వాములను చేసి మూడు రోజులపాటు శ్రమదానంతో చెత్తను తరిమేయాలని, ఆ తర్వాత రోడ్లపై ఎక్కడా చెత్త వేయకుండా ఆటోలోకో, రిక్షాలోకో మాత్రమే చెత్త వెళ్లాలని టీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు నగర శివార్లలో సోమవారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో త్వరలోనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో పాటు నగర దర్శనం పేరిట గ్రేటర్‌లోని టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు  సమష్టిగా నగరాన్ని చుట్టిరానున్నారు. అత్యంత అధ్వాన్నంగా ఉన్న బస్తీల నుంచి ఈ యాత్రకు శ్రీకారం చుడతారు. నగరాన్ని గొప్పగా చేసినా, ధ్వంసం చేసినా మీ చేతుల్లోనే ఉందని సీఎం ఉద్భోదించడం కొత్త ఉత్సాహం ఇచ్చిందని పలువురు కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. దారుణంగా ప్రాంతా ల్ని బాగుచేసేందుకు కార్పొరేటర్ల నిధులతోపాటు అవసరమైతే వంద కోట్లైనా అదనం గా మంజూరు చేస్తానని సీఎం అనడం తమకు కొండంత బలాన్నిచ్చిందంటున్నారు. నగర ప్రజలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లతో భారీ మెజార్టీ కట్టబెట్టారంటే టీఆర్‌ఎస్ పని తీరు చూసి ఓట్లేశారని, ఆ నమ్మకం సడలకుండా పని చేయాలని పిలుపునిచ్చారన్నారు.

 
స్థానిక కమిటీలకు ప్రాధాన్యం..

మరోవైపు స్థానిక బస్తీ కమిటీలను వివిధ అంశాల్లో భాగం చేసేందుకు  సిద్ధమవుతున్నారు. పని చేయలేదంటే కార్పొరేటర్‌ను నిందించకుండా ఉండేందుకు ప్రజలకు కూడా అన్ని అంశాల్లో భాగస్వామ్యం కల్పించాలని సూచించారని, దాన్ని అమలు చేస్తే తమను విమర్శించేందుకు ఆస్కారం ఉండదని కార్పొరేటర్లు భావిస్తున్నారు. ఐదువేల జనాభాకో కమిటీ చొప్పున వీటిని ఏర్పాటు చేయనున్నారు. 

 
అధ్యయన యాత్రలు..

పారిశుధ్య నిర్వహణ తదితర కార్యక్రమాల అమలు కోసం నాగపూర్ వంటి నగరాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి వచ్చేందుకూ సిద్ధమవుతున్నారు. ఎక్కడ మేలైన విధానాలుంటే అక్కడకు వెళ్లి, సరిగ్గా అధ్యయనం చేసి రావాల్సిందిగా సీఎం సూచించారన్నారు.

 

రియోడిజెనీరో స్ఫూర్తిగా..

రియోడిజెనీరోపై ప్రస్తుతం కార్పొరేటర్లు ఆరా తీస్తున్నారు. ఆ నగరాన్ని గురించి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. తమ డివిజన్లలో నాటిన మొక్కల్లో 90 శాతం బతికించే కార్పొరేటర్లకు కోటి రూపాయల వంతున సీఎం ఫండ్ నుంచి ఇస్తామనడంతో తాము దాన్ని దక్కించుకుంటామని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

 
డబుల్ కోసం పాటుపడతాం..

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఆశతో నగర ప్రజలు అపూర్వ విజయాన్నిచ్చారని, అందుకోసం ఎమ్మెల్యేల సమన్వయంతో త్వరితగతిన వాటి నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారని, ఆ దిశగా కృషి చేస్తామని కార్పొరేటర్లరు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ త్వరలో ఆస్కితో కలిసి పనిచేయనుంది. వివిధ అంశాల్లో అపారమైన అనుభవమున్న ఆస్కి సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా సూచించిన ముఖ్యమంత్రి రెండూ కలిసి పనిచేసేందుకు లక్ష్యాలు నిర్దేశించుకోవాలనడంతో ఆ దిశగ  పనులు చేపట్టనున్నారు. ఆదాయాన్ని బట్టి ఖర్చు ఉండాలని, అందుకనుగుణంగా ప్రాధాన్యతలను బట్టి పనులు చేయాలని సీఎం సూచించారు. కొన్ని పనుల్ని ఆస్కి, జీహెచ్‌ఎంసీ కలిసి చేయడంతో పాటు కొన్నింటిని ఆస్కికే ఇవ్వాలని చెప్పారు. రోడ్లు బాగులేవని ప్రజలు తిడుతున్నారని, దాన్ని రూపుమాపాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ గతంలో ఎలా ఉండింది.. ప్రస్తుతం ఎలా ఉంది.. భవిష్యత్‌లో ఎలా ఉండాలి..? అనేవి ఆలోచించి పనిచేయాలని ఉద్భోదించారు. మరమ్మతుల పేరిట ప్రతియేటా నిధులు ఖర్చు చేసే విషపూరిత గ్యాంగ్స్ ఉన్నాయని, ఇకపై అలా జరుగకుండా బడ్జెట్‌నిధుల్ని వేటికి ఎన్ని వినియోగించాలో, పకడ్బందీగా చర్యలుండాలన్నారు.  జీహెచ్‌ఎంసీ చుట్టూనే కాక ఇలాంటి గ్యాంగ్స్ ఎమ్మెల్యే, ఎంపీ క్వార్టర్స్ మరమ్మతుల పేరిట కూడా నిధులు కాజేస్తాయన్నారు.  ప్రజల సొమ్ము ప్రతి రూపాయీ నగరాభివృద్ధికే వినియోగించాలని సూచించారు. నగరం లివబుల్, లవబుల్ సిటీగా తీర్చిదిద్దే బాధ్యత మీదేనని ఉద్భోదించారు. 

 

‘ప్రగతి రిసార్ట్స్’లో ఎందుకు..?
శిక్షణ తరగతులకు ప్రగతి రిసార్ట్స్‌ను ఎందుకు ఎన్నుకుందీ సీఎం వివరించారు. అక్కడున్న మొక్కల్లో మస్కిటో రిపెల్లెంట్ ట్రీస్ ఉన్నాయని, వాటి వల్ల దోమలు ఉండవన్నారు. ఆలౌట్, హిట్ వంటివి లేకున్నా రిసార్ట్‌లో ఒక్క దోమ కూడా లేకపోవడానికి అదే కారణమంటూ.. చెట్ల పెంపకంవల్ల లాభాలను ఉదహరించారు. నగరాన్ని కూడా అలా తీర్చిదిద్దేందుకు, వాటి గురించి తెలియజేసేందుకే దీన్ని వేదికగా ఎంపిక చేసినట్లు చెప్పారు.  రాత్రి ఇక్కడే పడుకొని ఉదయం అందరినీ మార్నింగ్ వాక్ చేయించాలని, రిసార్ట్‌లోని చెట్లన్నీ చూపించాలని మేయర్ రామ్మోహన్‌కు సూచించారు.

 

కొత్త సరుకు అని..

రాజకీయ అంగట్లోకి వచ్చిన కొత్తసరుకును ఓసారి చూద్దామనే తలంపుతోనే ప్రజలు టీఆర్‌ఎస్‌కు భారీగా పట్టం కట్టారని ముఖ్యమంత్రి అన్నారు.  గతంలో ఎప్పుడో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి కాంగ్రెస్ ఏకపార్టీగా గెలిచిందని, ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఏ పార్టీ కూడా సొంతంగా గెలవలేదన్నారు. మేయర్ ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం ఒకసారి తీగల కృష్ణారెడ్డి గెలిచారన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ సాధారణ విజయం గత పార్టీలు, పాలకులపై తీవ్ర నిరసనతో అని చెబుతూ ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement